Andhra Pradesh Government: ఏపీ ప్రజలకు కిక్కిచ్చే న్యూస్.. రూ.లక్ష విలువ చేసే బైక్ ఫ్రీ.. కొత్త పథకం అమలుకు రంగం సిద్దం..
ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కొత్తగా అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెేరవేరుస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌లో భాగంగా అనేక హామీలను నెరవేర్చగా.. ఇప్పుడు మరో హామీకి సిద్దమవుతోంది. అదేంటంటే..

Andhra News: ఏపీలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి సహాయం అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దివ్యాంగులకు నెలనెలా రూ.6 వేల పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక వారి సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్న ఏపీ సర్కార్.. తాజాగా మరో ప్రకటన చేసింది. దివ్యాంగులుకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలు అందించనుంది. దివ్యాంగులు ఎక్కడికైనా సులువుగా వెళ్లడానికి ఇవి సహాయపడతాయి. వీటి సహాయంతో ఎక్కడికైనా ఈజీగా వెళ్లి రావొచ్చు. త్వరలోనే దివ్యాంగులకు మూడు చక్రాల రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్‌ను ఉచితంగా అందిస్తామని దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు.
నియోజకవర్గంలో 10 మందికి
తొలుత రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 10 మందికి ఫ్రీగా బైక్‌లు అందించనున్నట్లు మంత్రి వీరాంజనేయస్వామి తెలిపారు. ఇందుకోసం రూ.17.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని, తొలి విడతలో 1750 మంది దివ్యాంగులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇక దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో రూ.200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్డేడియం నిర్మిస్తున్నామని, వారికి వివిధ క్రీడల్లో ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. ఇక వారికి ఉపాధి కల్పించేందుకు 21 సెంచరీ సాప్ట్‌వేర్ సొల్యూషన్స్ సహాయంతో ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఇక ట్రాన్స్‌జెండర్లకు కూడా రేషన్ కార్డులు, ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.
అర్హతలు ఇవే
దివ్యాంగులకు ఇచ్చే ఒక్క బైక్ ధర రూ.లక్ష ఉంటుంది. వీటిని దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఫ్రీగా బైక్ అందుకోవాలంటే డిగ్రీపైన చదివి ఉండాలి. ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ కలిగి ఉండాలి. 70 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి తొలుత పంపిణీ చేయనున్నారు. ప్రతీ ఏటా వాహనాలు అందిస్తూనే ఉంటామని, ఇది నిరంతర ప్రక్రియగా మంత్రి వీరాంజనేయస్వామి స్పస్టం చేశారు.
