Rajasthan Borewell Accident: 8 రోజులుగా బోరుబావిలోనే 3 ఏళ్ల చిన్నారి నరకయాతన.. చిట్టితల్లి క్షేమమేనా?
తండ్రితో పొలానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి అడుకుంటూ బోరు బావిలో పడిపోయిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 170 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారిని సోమవారం మధ్యాహ్నం నాటికి బయటకు తీసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు మాత్రం అధికారు నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను సకాలంలో కాపాడలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు..
జైపూర్, డిసెంబర్ 30: రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో డిసెంబర్ 23న బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గత 8 రోజులుగా మృత్యువుతో పోరాడుతుంది. 170 అడుగుల లోతులో పడిపోయిన చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజుకు చేరింది. చిన్నారిని చేరుకునేందుకు సమాంతంరంగా సొరంగం తవ్వుతున్నారు. 40 గంటలుగా సొరంగం తవ్వుతుండగా వారికి పెద్ద బండ రాయి అడ్డు తగిలింది. సోమవారం మధ్యాహ్నానికి రాయిని తొలగించి చిన్నారిని చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చేతన పరిస్థితిపై పాలనా యంత్రాంగం ఏమీ చెప్పడం లేదు. రాజస్థాన్‌లో ఇది అత్యంత కష్టతరమైన ఆపరేషన్‌గా జిల్లా కలెక్టర్ కల్పనా అగర్వాల్ అభివర్ణించారు. అయితే నిర్లక్ష్యమే కారణమని చిన్నారి కుటుంబం ఆరోపించింది.
బోరులో పడిపోయిన తమ బిడ్డకు ఆహారం, నీరు సరఫరా చేయడంలేదని, డిసెంబర్ 24 సాయంత్రం నుంచి చిన్నారిలో ఎలాంటి కదలికలు కనిపించడం లేదని తల్లిదండ్రులు రోధిస్తూ చెబుతున్నారు. అంతేకాకుండా అధికారులు కూడా ఆ తర్వాత నుంచి కుటుంబ సభ్యులకు విజువల్స్ చూపించడం మానేశారని చెబుతున్నారు. 170 అడుగుల దిగువ నుంచి 8 అడుగుల సొరంగం తయారు చేస్తున్నామని యోగేష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 5 అడుగుల సొరంగం తవ్వమని అధికారులు చెబుతున్నారు. నేటితో ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఖేత్రీ మైన్స్ నుంచి ఇంజనీర్లను పిలిపించామని, సొరంగం ఖచ్చితత్వాన్ని తనిఖీ చేశారని తెలిపారు.
బాలిక తల్లి ధోలీ దేవి తన కుమార్తెను బయటకు తీసుకురావాలని రెస్క్యూ టీమ్ సిబ్బందిని నిరంతరం వేడుకుంటోంది. ఆమె ఏడుస్తున్న వీడియో శనివారం బయటకు వచ్చింది. అందులో ఆమె తన కూతురిని బయటకు తీసుకురావాలని అధికారులను చేతులు జోడించి వేడుకుంది. స్థానిక పోలీసులు, పరిపాలన సహాయంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు కొనసాగిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఈ వీడియోలో కనిపించింది.
కాగా కోఠ్‌పుత్లీ జిల్లాలోని కిరాట్‌పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చేతన డిసెంబరు 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులను ఆశ్రయించడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.