AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. ఐసీయూలోనే బూడిదగా మిగిలారు.. కటక్ ఆస్పత్రిలో ఘోరప్రమాదం.. 10 మంది దుర్మరణం..

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆ నిస్సహాయులను విధి వెక్కిరించింది. శ్వాస తీసుకోవడమే కష్టమైన స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని, అగ్నికీలలు ఊపిరాడకుండా చేశాయి. ఒడిశాలోని ప్రతిష్టాత్మక ఎస్.సి.బి మెడికల్ కాలేజీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఐసీయూలో ఎగిసిపడ్డ మంటల ధాటికి 10 మంది రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అయ్యో దేవుడా.. ఐసీయూలోనే బూడిదగా మిగిలారు.. కటక్ ఆస్పత్రిలో ఘోరప్రమాదం.. 10 మంది దుర్మరణం..
Cuttack Scb Medical College Fire Accident
Krishna S
|

Updated on: Mar 16, 2026 | 8:10 AM

Share

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్.సి.బి మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామాకేర్ ఐసీయూ విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని ట్రామాకేర్ బ్లాక్‌లో ఉన్న ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల్లోనే మంటలు ఐసీయూ అంతటా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. ఆ సమయంలో ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న రోగులు బయటకు రాలేక, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

రెస్క్యూ ఆపరేషన్‌లో విషాదం

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 15 మంది రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న కొందరు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కూడా దట్టమైన పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గాయపడిన వారందరికీ అదే ఆసుపత్రిలోని మరో విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

సీఎం పరామర్శ.. ఉన్నత స్థాయి విచారణ

ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అగ్నిమాపక నిబంధనల అమలులో ఏవైనా లోపాలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

భయాందోళనలో రోగుల బంధువులు

రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదం జరగడంతో రోగుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

Follow Us