సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్.. ఐఐఎంబిలో గోల్డ్ మెడల్‌తో ధ్వీత్ మెహతా సరికొత్త రికార్డ్..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విదేశాల్లో లక్షల జీతం.. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలో కొలువు.. ఇంతకంటే లైఫ్ ఇంకేం కావాలి అనుకుంటాం కదా.. కానీ, ఆ యువకుడు మాత్రం తన కన్న కల కోసం ఆ లగ్జరీ లైఫ్‌ను వదులుకున్నాడు. నార్వేలో ఉద్యోగానికి రాజీనామా చేసి, స్వదేశానికి తిరిగి వచ్చి, దేశంలోనే అత్యున్నత మేనేజ్‌మెంట్ సంస్థ ఐఐఎం బెంగళూరులో గోల్డ్ మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కష్టపడితే సాధ్యం కానిది లేదని నిరూపించాడు గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల ధ్వీత్ మెహతా. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, స్వదేశానికి తిరిగి వచ్చి..దేశంలోని అత్యున్నత మేనేజ్‌మెంట్ సంస్థ ఐఐఎం బెంగళూరులో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించాడు. ధ్వీత్ ప్రయాణం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. ధ్వీత్ ప్రయాణం ఆనంద్‌లోని ఆనందాలయ స్కూల్ నుండి మొదలైంది. IIIT అలహాబాద్‌లో కంప్యూటర్ సైన్స్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన ధ్వీత్, కెరీర్ ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలో చోటు సంపాదించాడు. 2022లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నార్వే వెళ్లిన అతడు.. అక్కడ వృత్తిపరంగా ఎదిగాడు. అయితే కోడింగ్ ప్రపంచంలో రాణిస్తున్నా, అతని మనసు మాత్రం ఫైనాన్స్ రంగం వైపు లాగింది.
కోచింగ్ లేకుండానే CFA..
ఉద్యోగం చేస్తూనే ఎవరి సహాయం లేకుండా సెల్ఫ్ స్టడీతో కఠినమైన CFA లెవల్-1, లెవల్-2 పూర్తి చేశాడు. 2024లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. మైక్రోసాఫ్ట్ నార్వే ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎంబీఏ కోసం భారత్‌కు తిరిగి వచ్చాడు. ఐఐఎం బెంగళూరులో సీటు సాధించిన ధ్వీత్, అక్కడ ఐఐటీల నుండి వచ్చిన ఉద్ధండుల మధ్య తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
గోల్డ్ మెడలిస్ట్.. వాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
మార్చి 27న జరిగిన ఐఐఎం బెంగళూరు 51వ స్నాతకోత్సవంలో ధ్వీత్ మెహతా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఐఐఎం బి చరిత్రలో అకడమిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన రెండో గుజరాతీగా ధ్వీత్ రికార్డు సృష్టించాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా సంస్థలోని ప్రతిష్టాత్మక వాల్ ఆఫ్ ఫేమ్‌పై అతని పేరును లిఖించారు. ‘‘ఇది కేవలం నా ఒక్కడి విజయం కాదు.. నా కుటుంబం, స్నేహితులు, ఐఐఎం బెంగళూరు అధ్యాపకుల మద్దతుకు దక్కిన గౌరవం” అని ధ్వీత్ ఎమోషనల్ అయ్యాడు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వైపు..
ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నప్పటికీ.. ఫైనాన్స్ మీద ఉన్న మక్కువతో ఇప్పుడు ముంబైకి చెందిన ఒక ప్రముఖ సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. కోడింగ్ ల్యాబ్‌ల నుండి క్యాపిటల్ మార్కెట్ల వరకు ధ్వీత్ చేసిన ఈ ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం.
