AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : హేజిల్‌వుడ్‌ను కాపీ కొట్టాడు.. వికెట్లను గల్లంతు చేశాడు.. ముకేష్ మామూలోడు కాదు

IPL 2026 : ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. సమీర్ రిజ్వీ 90 పరుగులతో మెరవగా, ముకేష్ కుమార్ తన అద్భుత బౌలింగ్‌తో ముంబై ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. ఆస్ట్రేలియా దిగ్గజం జోష్ హేజిల్‌వుడ్ శైలిని ముకేష్ పుణికిపుచ్చుకున్నాడు

IPL 2026 : హేజిల్‌వుడ్‌ను కాపీ కొట్టాడు.. వికెట్లను గల్లంతు చేశాడు.. ముకేష్ మామూలోడు కాదు
Mukesh Kumar
Rakesh
|

Updated on: Apr 05, 2026 | 11:52 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో ఢిల్లీ ఘనవిజయం సాధించి, వరుసగా రెండో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. సమీర్ రిజ్వీ 90 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించగా, ఆ విజయానికి పునాది వేసింది మాత్రం పేసర్ ముకేష్ కుమార్. తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేసిన ముకేష్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 క్రికెట్ అంటే రకరకాల వైవిధ్యాలు ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ముకేష్ కుమార్ మాత్రం పాతకాలపు పద్ధతినే నమ్ముకున్నాడు. అదే కచ్చితమైన లెంగ్త్‌ను పదే పదే విసరడం. ఆస్ట్రేలియా దిగ్గజం జోష్ హేజిల్‌వుడ్ శైలిని ముకేష్ పుణికిపుచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ముకేష్ మాట్లాడుతూ.. “గతేడాది హేజిల్‌వుడ్ బౌలింగ్‌ను గమనించాను. అతను నిలకడగా టెస్ట్ లెంగ్త్‌ను హిట్ చేస్తాడు. మా కోచ్ కూడా అదే చేయమని చెప్పారు. ఆ లెంగ్త్‌లో బంతి పడితే బ్యాటర్లకు పరుగులు చేయడం చాలా కష్టం” అని తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టాడు.

నిజానికి ఈ సీజన్ ఆరంభంలో ముకేష్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ ఐపీఎల్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ముకేష్ అదృశ్య ప్రదర్శన చేసి మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. టీమ్ ఇండియా తరపున ఆడిన అనుభవం ఇక్కడ ముకేష్‌కు బాగా పనికొచ్చింది. లక్నోతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ముకేష్, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముకేష్ 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ర్యాన్ రికెల్టన్‌ను తన లెంగ్త్‌తో బోల్తా కొట్టించి పెవిలియన్ పంపగా, తిలక్ వర్మను కేవలం రెండు బంతుల్లోనే పెవిలియన్ చేర్చాడు. 114.7 కిలోమీటర్ల వేగంతో వేసిన నకిల్ బాల్‌తో తిలక్ వర్మను బురిడీ కొట్టించి తనకే క్యాచ్ ఇచ్చేలా చేశాడు. పిచ్ స్లోగా ఉన్నప్పుడు కట్టర్లు వేస్తూ, హార్డ్ లెంగ్త్‌ను హిట్ చేయడం వల్ల ముంబై బ్యాటర్లు షాట్లు ఆడలేక చేతులెత్తేశారు. వికెట్లను టార్గెట్ చేస్తూ ముకేష్ వేసిన బంతులు ఢిల్లీకి విజయాన్ని సులువు చేశాయి.

ప్రస్తుతం ముకేష్ కుమార్ వయసు 32 ఏళ్లు. ఫాస్ట్ బౌలర్లకు ఇది చాలా కీలకమైన సమయం. 2023లో వెస్టిండీస్ టూర్‌లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ముకేష్, ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ అతనికి చాలా ముఖ్యం. ఢిల్లీకి మొదటి టైటిల్ అందించడమే కాకుండా, తన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడాలని ముకేష్ పట్టుదలతో ఉన్నాడు. ఎటువంటి ఆర్భాటం లేకుండా, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న ముకేష్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్‌లో ప్రధాన ఆయుధంగా మారాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us