జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే.. క్లారిటీ ఇచ్చిన సౌమ్యరావు
ప్రముఖ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రజాదరణ పొందిన యాంకర్స్ లో సౌమ్య రావు ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు పెద్దగా కనిపించడం లేదు.. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొని సందడి చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, జబర్దస్త్ అనుభవాలు, తెలుగు ప్రేక్షకుల అభిమానం,అలాగే పలు పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. తాను పుట్టుకతో కన్నడ అమ్మాయిని అని, కర్ణాటక నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన తర్వాతే తెలుగు భాష నేర్చుకున్నానని సౌమ్య రావు వెల్లడించారు. సీరియల్స్ చేసే సమయంలో తనకు తెలుగు అంతగా తెలియదని, జబర్దస్త్ లాంటి పెద్ద షోలో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు, తన భాషా పరిజ్ఞానంపై మొదట భయపడ్డానని ఆమె తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తనను అంగీకరించకపోవచ్చునని, తెలుగు సరిగా రాని వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారని విమర్శిస్తారేమోనని భావించినట్లు సౌమ్య రావు పేర్కొన్నారు. అయితే, తన ఆందోళనలను పటాపంచలు చేస్తూ, తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో బాగా ఆదరించారని, ప్రేమించారని ఆమె గుర్తుచేసుకున్నారు.
తెలుగు ప్రేక్షకుల అంగీకారం తన జీవితంలో ఒక పెద్ద మలుపు అని, తెలుగు భాష పట్ల తనకు ఎనలేని అభిమానాన్ని పెంచిందని సౌమ్య రావు అన్నారు. జబర్దస్త్ లో దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు పనిచేసిన సౌమ్య, ఆ షో నుండి అనూహ్యంగా వైదొలగిన తర్వాత తాను అనుభవించిన బాధను వివరించారు. మారుతి 800 కారులో డ్రైవర్‌గా ఉన్న వ్యక్తికి బెంజ్ కారు ఇచ్చి, ఆపై హైవేలో వదిలేసినట్లు తన పరిస్థితి అనిపించిందని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ సంఘటన తర్వాత తనకు కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చిందని, తగిన ప్రోత్సాహం లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యాంకర్ పరిపూర్ణంగా మారాలంటే వారికి ఎక్కువ అవకాశాలు, స్టేజ్‌లు అవసరమని, అలాంటి మద్దతు కొన్ని చోట్ల లభించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను బయటకు రావడానికి హైపర్ ఆది కారణమని గతంలో ప్రచారం జరిగిన వార్తలను సౌమ్య రావు ఖండించారు. హైపర్ ఆది, ఆయన టీమ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, వాస్తవానికి వారు తనకు మద్దతు ఇచ్చారని ఆమె తెలిపారు.
ఒక షోలో తన మాట తీరును చూసి, హైపర్ ఆది, శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్‌కు సిఫార్సు చేశారని, చాలా బాగా మాట్లాడారు, చాలా బోల్డ్‌గా మాట్లాడారు, వీరిని తీసుకురండి అని చెప్పి తనకు మద్దతు ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. బాడీ షేమింగ్ కారణంగా ఆమె అవమానపడ్డారనే పుకార్లను కూడా ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ, అది వారి వ్యక్తిగత విషయం అని పేర్కొన్నారు. కెరీర్ బిగినింగ్ లో యాంకర్, న్యూస్ రీడర్‌గా పనిచేశానని సౌమ్య రావు వెల్లడించారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ మంచిని ప్రోత్సహిస్తారని, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వారినే ఆదరిస్తారని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
