Shrinath Khandelwal: కొడుకు వ్యాపారవేత్త, కూతురు లాయర్, కోట్ల ఆస్తి, ప్రముఖ రచయిత వృద్ధాశ్రమంలో కన్నుమూత.. అనాధలా అంత్యక్రియలు..
నాటి సూపర్ హిట్ మూవీ బడి పంతులు నుంచి నేటి అనేక కుటుంబ కథా సినిమాలు తల్లిదండ్రుల నుంచి ఆస్తిని తీసుకుని వాటిని అనాధలా వదిలేసిన పిల్లల గురించే.. ఇలాంటి సినిమాలు చూసిన వారు అసలు ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పిల్లలు పుట్ట కూడదు. పుట్టిన పెరగకూడదు.. పురిటిలో పోవాలి అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అలాంటి సినిమా కథకు సజీవ రూపంగా నిలుస్తుంది ఓ ప్రముఖ రచయిత జీవితం. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో ఓ తండ్రి నుంచి కొడుకు, కూతురు ఆస్తిని లాక్కుని .. తండ్రిని అనాధలా వదిలేశారు. చివరకు మరణించిన తర్వాత కూడా జన్మనిచ్చిన తండ్రిని చివరి చూపు చూడడానికి కూడా రాలేదు.
ఎన్టిఆర్ అంజలీ దేవి నటించిన బండి పంతులు సినిమా నేటి తరానికి పెద్దగా తెలియక పోయినా ..ఆస్తి తీసుకుని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన సినిమాలు అనేకం చూస్తూనే ఉంటున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన అనేక చిత్రాలు సమాజానికి సందేశం ఇస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కొడుకులు ఆస్తి తీసుకుని తండ్రిని అనాధాశ్రమంలో.. వదిలేసిన కథలకు నేటి సమాజంలో సజీవ సాక్ష్యంగా అనేక మంది నిలుస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో డబ్బు పిచ్చి పట్టి.. తండ్రిని అనాధలా వదిలేసిన పిల్లలు గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. తండ్రి ఆస్తిపై దురాశతో, కొడుకు, కుమార్తె తమ తండ్రిని మరణశయ్యపై విడిచిపెట్టారు. 80 ఏళ్ల వయసులో తండ్రి గత శనివారం మరణించారు. తండ్రి మరణ వార్త విన్న తర్వాత కూడా కొడుకు, కూతురు చివరి చూపు చూడడానికి రాలేదు. అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆ అనాధ తండ్రి పేరు శ్రీనాథ్ ఖండేల్వాల్.
వారణాసిలో నివసిస్తున్న ప్రముఖ రచయిత SN ఖండేల్వా అంతిమ జీవితం నేటి తరానికి సంబంధించిన తండ్రి జీవిత కథ. కోట్ల ఆస్థి ఉన్నా శ్రీనాథ్ ఖండేల్వాల్ తన జీవితాన్ని అనాథ శరణాలయంలో గడపవలసి వచ్చింది. శ్రీనాథ్ ఖండేల్వాల్ మార్చి 2024 నుంచి కాశీ లెప్రసీ సేవా సంఘ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. సుమారు రూ. 80 కోట్ల ఆస్తి ఉన్నా సరే అతను అనాధలా వృద్ధాశ్రమంలో చివరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఖండేల్వాల్ 400 కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు. శ్రీనాథ్ ఖండేల్వాల్ రచించిన పుస్తకాలు ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆత్మీయులు అన్నా.. అనాధలా అంత్యక్రియలు
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఖండేల్వాల్ మరణం గురించి ఆసుపత్రి సిబ్బంది వృద్దాశ్రమ నిర్వాహకులకు సమాచారం అందించింది. అయితే ఈ విషయాన్నీ శ్రీనాథ్ ఖండేల్వాల్ పిల్లలకు తెలియజేయాలని ప్రయత్నించారు. తమ తండ్రిని చివరి సారి చూసేందుకు కానీ.. అంత్యక్రియలు నిర్వహించేందుకు కానీ కూతురు, కొడుకు ఇష్టపడలేదు. దీంతో అమన్ కబీర్, అతని స్నేహితులు శ్రీనాథ్ ఖండేల్వాల్ అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనాథ్ ఖండేల్వాల్ కొడుడు ఓ బడా వ్యాపారి.. తండ్రి అంత్యక్రియలకు రావడానికి నిరాకరించగా.. కూతురు సుప్రీం కోర్టులో న్యాయవాది.. ఆమె ఫోన్ చేసినా స్పందించలేదని తెలుస్తోంది. అల్లుడు కూడా సుప్రీంకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.
80 కోట్ల ఆస్తి.. కనీసం ఇల్లు లేదు
ఒకసారి శ్రీనాథ్ ఖండేల్వాల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దుస్థితి గురించి చెప్పారు. 80 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుని తన కొడుకు , కూతురు ఇంటి నుంచి తనని గెంటేశారని చెప్పారు. ఇల్లు, పెళ్లి, కొడుకు, కూతురు అంతా గతం.. ఇప్పుడు ఎవరూ తన జీవితంలో భాగం కాదు అన్నారు. తాను అనారోగ్యం బారిన పడిన సమయంలో తాను చస్తే.. తన మృతదేహాన్ని బయటకు విసిరేయమని తన పిల్లలు చెప్పారంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇన్ని బాధల మధ్య తాను చివరి క్షణాలను కాశీ క్షేత్రంలో గడపడానికి వృద్ధాశ్రమానికి వచ్చినట్లు అప్పుడు తన దుస్థితి గురించి వివరించారు.
శ్రీనాథ్ ఖండేల్వాల్ ఎవరంటే
కాశీలో జననం, 10వ తరగతి ఫెయిల్.. ఆన్‌లైన్‌లో వందలాది పుస్తకాలు
శ్రీనాథ్ ఖండేల్వాల్ వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. కాశీలో జన్మించిన ఖండేల్వాల్ 15 సంవత్సరాల వయస్సులో కలం పట్టారు. శ్రీనాథ్ ఖండేల్వాల్ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు.. అయితే సాహిత్యం ఉన్న ఇష్టంతో 15 సంవత్సరాల వయస్సు నుంచి కలం పట్టారు. అనేక పుస్తకాలు రాశారు. వీటిల్లో పురాణా పుస్తకాలున్నాయి. అనువాద పుస్తకాలు కూడా ఉన్నాయి. శ్రీనాథ్ ఖండేల్వాల్ అనువాదంలో అందవేసిన చెయ్యి.. అతని జీవితంలో 400 పుస్తకాలు రాశారు. వాటిల్లో చాలా పుస్తకాలు ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా లభ్యం అవుతున్నాయి. శివపురాణం 5 సంపుటాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వీటి ధర 6 వేల కంటే ఎక్కువ.
3000 పేజీలలో మత్స్య పురాణం
శ్రీనాథ్ ఖండేల్వాల్ రకరకాల పుస్తకాలు రచించారు. ముఖ్యంగా 3000 పేజీలతో రాసిన మత్స్య పురాణం వెరీ వెరీ ఫేమస్. అంతేకాదు శివపురాణం, పద్మ పురాణాలు రచించారు. హిందీ, సంస్కృత భాషల్లోనే కాదు అస్సామీ, బెంగాలీ భాషల్లో కూడా పుస్తకాలు రాశారు. ప్రస్తుతం నరసింహ పురాణాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు.. ఈ పుస్తకం త్వరలో ప్రచురణకు వెళ్లనుంది.. అయితే శ్రీనాథ్ ఖండేల్వాల్ ఆ పుస్తక ప్రచురణ చూడకుండానే ఆ కోరిక నెరవేరకుండానే శివ సన్నిధికి చేరుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..