Vijayashanti: ఆ కారణంతోనే మళ్లీ బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను.. ఓపెన్‌గా చెప్పిన విజయశాంతి
నటి విజయశాంతి తన రాజకీయ ఎంట్రీ ఎలా జరిగిందన్న విషయాలను వెల్లడించారు. రజాకార్ల కాలం నుండి తన కుటుంబానికి తెలంగాణతో ఉన్న సంబంధం తనను ప్రభావితం చేసిందని తెలిపారు. బాలకృష్ణతో నిప్పురవ్వ తర్వాత సినిమాలు చేయకపోవడంపై, తన ఇమేజ్ మారి, హీరోయిన్-సెంట్రిక్ చిత్రాలపై దృష్టి పెట్టడం వల్ల గ్యాప్ వచ్చిందని స్పష్టం చేశారు.

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక ఘట్టాలను, ముఖ్యంగా రాజకీయ ప్రవేశానికి గల కారణాలను, అలాగే బాలకృష్ణతో కలిసి మళ్ళీ సినిమా చేయకపోవడానికి వెనుక విషయాలను పంచుకున్నారు. తెలంగాణ అంశమే తన రాజకీయ ప్రవేశానికి బీజం వేసిందని విజయశాంతి స్పష్టం చేశారు. రజాకార్ల కాలం, నిజాం పరిపాలన సమయంలో తన తాతగారి కుటుంబం ఎదుర్కొన్న తీవ్రమైన పరిస్థితులు, హైదరాబాద్ నుండి చెన్నైకి వలస వెళ్లిన వైనం తనపై లోతైన ప్రభావాన్ని చూపాయని ఆమె పేర్కొన్నారు. తన తల్లి తరచుగా ఆనాటి కష్టాలను వివరించగా, అది తనలో తెలంగాణ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్‌ను ఏర్పరచిందని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని, రాజకీయాల్లోకి రావాలని తన భర్త కూడా ప్రోత్సహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఎంటర్ ది డ్రాగన్ తరహాలో వార్ ఫీల్డ్‌లోకి దిగమని ఆయన చెప్పగా, 1998 జనవరి 26న బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు విజయశాంతి వివరించారు. ఇక ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో దాదాపు 17-18 చిత్రాల్లో కలిసి నటించానని తెలిపారు. నిప్పురవ్వ సినిమా తర్వాత బాలకృష్ణతో మళ్ళీ నటించకపోవడానికి కారణం కథలు కుదరకపోవడమో, లేదా ఎవరితోనో చేయకూడదనో కాదని ఆమె స్పష్టం చేశారు. ఆనాటి పరిస్థితులు, ఇతర సినిమా కమిట్‌మెంట్లు, ముఖ్యంగా తన సినీ కెరీర్‌లో వచ్చిన గణనీయమైన మార్పు దీనికి ప్రధాన కారణాలని వివరించారు. అప్పటికే హీరోయిన్‌గా ఒక విభిన్నమైన ఇమేజ్ పొంది, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా మారానని చెప్పారు.
ఆ ఇమేజ్ మారడం వల్ల తన సినిమాలను తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత తన దృష్టి ప్రధానంగా హీరోయిన్-సెంట్రిక్ చిత్రాలపైనే నిలిచిందని పేర్కొన్నారు. నటిగా తనకు లభించిన ఈ లేడి సూపర్ స్టార్ ఇమేజ్, యాక్షన్ సినిమాల్లో నటించడం, అత్యధిక పారితోషికం పొందే స్థాయికి ఎదగడం తాను అసలు ఊహించలేదని, ఇది దైవదత్తమని విజయశాంతి అన్నారు. జీవితం అంటేనే ఒక మాయ అని, చివరికి ఎవరూ ఏదీ వెంట తీసుకెళ్లరని, కేవలం మంచి పేరు మాత్రమే మిగులుతుందని ఆమె తన తత్వాన్ని పంచుకున్నారు. బతికి ఉన్నంత కాలం పదిమందికి ఉపయోగపడాలని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని, స్వార్థంతో ఉండకూడదని తెలిపారు.
ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..
