Rahul Gandhi Passport: కొత్త పాస్‌పోర్ట్ కోసం NOC ఇవ్వండి.. ఢిల్లీ కోర్టును అభ్యర్థించిన రాహుల్ గాంధీ..
మార్చి నెలలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయబడింది. రాహుల్ తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారు. దీంతో ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం (మే 23) అమెరికా పర్యటనకు ముందు కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయాలని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సాధారణ పాస్‌పోర్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని కోరారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో మార్చిలో లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీ తన పాస్‌పోర్టును సరెండర్ చేశారు. 2019లో కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రాహుల్ గాంధీ కొత్త సాధారణ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు జూన్‌లో 10 రోజుల యుఎస్ పర్యటనకు వెళ్లనున్నారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా ప్రసంగిస్తారు.
రాహుల్ గాంధీ శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌లలో పర్యటించనున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తెలిపారు. తన పర్యటన సందర్భంగా.. మాజీ శాసనసభ్యుడు ఇండియన్-అమెరికన్‌లతో రెండు బహిరంగ సమావేశాలలో ప్రసంగించే అవకాశం ఉంది. కాపిటల్ హిల్‌లో చట్టసభ సభ్యులు, థింక్ ట్యాంక్‌ల సభ్యులను కలవడం, విశ్వవిద్యాలయ విద్యార్థులతో సంభాషించడం. వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌లను కలవడం.. వంటి కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొననున్నారు.
యూకేలో చేసిన వ్యాఖ్యలపై దుమారం
రాహుల్ గాంధీ కూడా కొన్ని వారాల క్రితం యూకే పర్యటనకు వెళ్లి వచ్చారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దేశంలోని సంస్థలపై బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ దాడులు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ తర్వాత భారత్‌లో పెను తుఫాను చెలరేగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీలు రోడ్డు నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారని, విదేశీ జోక్యానికి పూనుకున్నారని బీజేపీ ఆరోపించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం