Rating Hotels Jobs: సైబర్ కేటుగాళ్ల గరానా మోసం.. హోటల్స్‌కు రేటింగ్స్ ఇస్తూ రూ.13 లక్షలు పోగొట్టుకున్న యువతి
ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎరవేసి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దొంగిలిస్తున్న కేసులు ఈ మధ్యకాలంలో లెక్కకుమించి బయటపడుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలకు ఎందరో బలవుతున్నారు. రోజుకో ఎత్తుతో బాధితులను నిండా ముంచుతున్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఎలాంటి కష్టం లేకుండా ఆన్‌లైన్ చిన్న చిన్న టాస్క్‌లు చేస్తే సులువుగా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి వలలో వేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇటువంటి ఇచ్చులోనే చిక్కుకుని..

పూణె, అక్టోబర్ 17: ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎరవేసి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దొంగిలిస్తున్న కేసులు ఈ మధ్యకాలంలో లెక్కకుమించి బయటపడుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలకు ఎందరో బలవుతున్నారు. రోజుకో ఎత్తుతో బాధితులను నిండా ముంచుతున్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఎలాంటి కష్టం లేకుండా ఆన్‌లైన్ చిన్న చిన్న టాస్క్‌లు చేస్తే సులువుగా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి వలలో వేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇటువంటి ఇచ్చులోనే చిక్కుకుని రూ.13 లక్షలకుపైగా డబ్బు పోగొట్టుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే..
పూణేకు చెందిన మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదనపు సంపాదన కోసం ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్ కోసం వెదుకుతున్న క్రమంలో ఆమెకు ఆన్‌లైన్‌లో హోటల్స్‌కు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అధిక మొత్తం ఆర్జించవచ్చనే ప్రకటన చూసింది. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్‌ను సంప్రదించగా ఆన్‌లైన్‌లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తే డబ్బు చెల్లిస్తామని జూన్ 18న తెలిపారు. ప్రతి రేటింగ్‌కు రూ.150 ఇస్తామని కేటుగాళ్లు నమ్మబలికారు. అయితే అందుకు కొంతమొత్తంలో పెట్టుబడి పెట్టాలని షరతు పెట్టారు. అది నమ్మని ఆమె కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి కొన్ని హోటళ్లకు రేటింగ్ ఇచ్చి డబ్బు అర్జించింది కూడా.
పూర్తిగా ఆమెను నమ్మించిన కేటుగాళ్లు అనంతరం కొన్ని ప్రీపెయిడ్ టాస్క్‌లు పూర్తిచేయాలని కోరారు. మరింత మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధిత మహిళ రూ.13.76 లక్షల నగదు పెట్టుబడిగా పెట్టింది. ఇలా అక్టోబర్ 13 వరకు ఆ టాస్క్‌లన్నీ పూర్తి చేసింది. ఆ తర్వాత స్కామర్లు పత్తాలేకుండా పోయారు. ఆమె పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా బదులుగా మరింత మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటూ స్కామర్లు కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.