పంజాబ్ రైతుల ఆగ్రహం.. కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేపై దాడి.. ఖండించిన సీఎం అమరీందర్
శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం ఒక్కసారిగా న్యూ టర్న్ తీసుకుంది. ఏకంగా ఓ ఎమ్మెల్యేను చితకబాదడం దుమారం రేపుతోంది.
Farmers thrash BJP MLA: శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం ఒక్కసారిగా న్యూ టర్న్ తీసుకుంది. ఏకంగా ఓ ఎమ్మెల్యేను చితకబాదడం దుమారం రేపుతోంది. దీంతో ఇక ముందు రైతుల ఆందోళన ఎక్కడి వరకు దారితీస్తుందోనని అందరిలో ఉత్కంఠ మొదలైంది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. కేంద్ర చట్టాలను సమర్ధిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేసిన రైతులు, ఆయన చొక్కాను చించేశారు. పోలీసుల రక్షణలో ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యంగా ఉత్తరాది రైతులు కొత్త సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీంతో ఢిల్లీ శివారులో కొన్ని నెలలుగా ఉద్యమం కొనసాగుతోంది. కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఇప్పుడు ఏకంగా ఓ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేయడంతో ఉద్యమం ఎటు వైపు వెళ్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
పంజాబ్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు బీజేపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. బట్టలు చింపి చితకబాదారు. ఈ దారుణం మలౌత్ పట్టణంలో జరిగింది. అబోహర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ నారంగ్‌ను టార్గెట్ చేశారు ఆందోళనకారులు. వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ ప్రసంగించినందుకే దాడి చేసినట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఎమ్మెల్యే నారంగ్‌పై సిరా దాడి చేసిన తరువాత బట్టలు చింపేశారు. ఈ ఘటనలో మరికొంతమంది బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. అనంతరం రైతులు బీజేపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు.
Punjab: Bharatiya Janata Party (BJP) MLA from Abohar Arun Narang was thrashed allegedly by protesting farmers in Malout yesterday.
An FIR has been registered at Malout Police Station. pic.twitter.com/c7DOYzEMYv
— ANI (@ANI) March 28, 2021
ఎమ్మెల్యేపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు. దాడి జరుగుతుంటే పంజాబ్ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు. ఎమ్మెల్యే అరుణ్‌నారంగ్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్. రైతుల పేరుతో అల్లరిమూకలు దాడికి పాల్పడ్డాయని , దీనికి బాధ్యత వహిస్తూ సీఎం అమరీందర్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. ఎమ్మెల్యేపై దాడి చేయడం మంచి పద్దతి కాదని ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను సంయుక్త కిసాన్‌మోర్చా ఖండించింది. ఇలాంటి ధోరణిని తాము ప్రోత్సహించబోమని, రైతులు శాంతియుతంగా నిరసన తెలుపాలని సూచించింది.
ఇదీ చదవండిః కొడుకు దుబాయి వెళ్లాడు.. కోడలు విలన్‌గా మారిపోయింది.. 15రోజులుగా గేటు బయట వృద్ధ దంపతుల పడిగాపులు..!