Gold: అబ్బ ఏం అదృష్టం.. 810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై ఒక్కసారిగా బోల్తా! ఆ తర్వాత ఏం జరిగిందంటే
పండ్లు, చేపలు, లిక్కర్ తరలిస్తున్న వాహనాలు రోడ్లపై అడపాదడపా బోల్తా పడటం గురించి మీరు వినే ఉంటారు. రోడ్డుపై అలా పడీపడగానే వాహనంలోని డ్రైవర్ ప్రాణాలు కాపాడవల్సింది పోయి.. ఎగబడి మరీ వాటిని ఎత్తుకుపోతుంటారు జనాలు. అదే బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడితే.. కళ్ల ముందు ఊహించుకుంటేనే..
కోయంబత్తూర్, మే 7: పండ్లు, చేపలు, లిక్కర్ తరలిస్తున్న వాహనాలు రోడ్లపై అడపాదడపా బోల్తా పడటం గురించి మీరు వినే ఉంటారు. రోడ్డుపై అలా పడీపడగానే వాహనంలోని డ్రైవర్ ప్రాణాలు కాపాడవల్సింది పోయి.. ఎగబడి మరీ వాటిని ఎత్తుకుపోతుంటారు జనాలు. అదే బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడితే.. కళ్ల ముందు ఊహించుకుంటేనే వణుకుపుడుతుంది కదా! తాజా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 810 కిలోల బంగారం రోడ్డుపై పడిపోయాయి. దీని విలువ సుమారు రూ.666 కోట్లు ఉంటుందని అంచనా.
సుమారు రూ.666 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్న ప్రైవేట్ కంటైనర్ సోమవారం అర్థరాత్రి తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని చిటోడ్ వద్ద బోల్తా పడింది. ఓ ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన కంటైనర్‌లో 810 కిలోల బంగారు ఆభరణాలను కోయంబత్తూర్ నుంచి సేలంకి రోడ్డు మార్గంలో బయల్దేరింది. అయితే సమతువపురం సమీపంలో మలుపు వద్ద డ్రైవర్ శశికుమార్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శశికుమార్‌తో పాటు సాయుధ సెక్యూరిటీ గార్డు బాల్‌రాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిటోడ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కంటైనర్‌లోని బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి సరుకుదారునికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి కొత్త ట్రక్కు, మరికొందరు సెక్యూరిటీ గార్డులను పంపించారు. వారు బోల్తా పడిన వాహనంలోని బంగారు ఆభరణాలను కొత్త ట్రక్కులోకి తరలించి వాహనాన్ని సేలంకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై చిటోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో బంగారం సేఫ్.. అదే పగలు ఈ ప్రమాదం జరిగి ఉంటే ఏం జరిగేదో ఒక్కసారి ఊహించండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.