Modi America Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు.. ఎప్పుడంటే..
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో ఆయన అమెరికా వెళ్ళే ఆవకాశం ఉంది.
Modi America Tour: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో ఆయన అమెరికా వెళ్ళే ఆవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కలిసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ ఏడాది జనవరిలో దేశంలో జో బైడెన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికాలో మన దేశ ప్రధాని చేస్తున్న మొదటి పర్యటన ఇది. ఈ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ.. ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రభుత్వం నుంచి విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరులోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఉండవచ్చని తెలుస్తోందని జాతీయ మీడియా చెబుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాని అమెరికా పర్యటన కోసం సెప్టెంబర్ 23, 24 తేదీలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా నియమితుడైన తరువాత బైడెన్‌తో ప్రధాని మోదీ తొలి వ్యక్తిగతంగా సమావేశం కావడం కూడా ఇదే. ఇరువురు నాయకులు వాస్తవంగా అనేక బహుపాక్షిక సమావేశాల కోసం కలుసుకున్నారు-మార్చిలో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం, ఏప్రిల్‌లో వాతావరణ మార్పు శిఖరాగ్ర సమావేశం, ఈ సంవత్సరం జూన్‌లో జి -7 సమావేశాలలో ఎరువుతూ పాల్గొన్నారు.
ఇక 2019 లో హ్యూస్టన్‌లో జరిగిన మెగా డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ చివరిసారిగా అమెరికాకు వెళ్లారు ‘హౌడీ, మోదీ!’ అంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం ప్రధాని మోడీ వాషింగ్టన్, న్యూయార్క్ వెళ్లనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం మారిన నేపథ్యంలో మోడీ అమెరికా వెళ్ళవచ్చని జరుగుతున్న ప్రచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలపై తాలిబాన్లు నియంత్రణ సాధించారు. రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్ళవచ్చనే వార్తలపై విశ్లేషకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
న్యూయార్క్‌లో, ప్రధాన మంత్రి వార్షిక ఉన్నత స్థాయి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వాషింగ్టన్‌లో, ప్రధానమంత్రి పర్యటన జరిగిన సమయంలోనే క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా విలేకరులతో మాట్లాడుతూ.. క్వాడ్ సమావేశం జరిగే అవకాశం ఉందని సూచించారు. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. తాను ఈ విషయంపై వ్యాఖ్యానిన్చాలేననీ, కానీ శిఖరాగ్ర సమావేశం జరిగితే, ప్రధాని మోడీ తానూ ఆ సమావేశానికి హాజరు కావాలని భావిస్తున్నట్టు ఇప్పటికే చెప్పారు. అందువల్ల ఒకవేళ ఈ సమావేశం జరిగితే, మోడీ తప్పకుండా హాజరు అవుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కరోనా కారణంగా ప్రపంచంలోని ఏ నాయకులూ కూడా వ్యక్తిగత లేదా.. అధికారిక పర్యటనలకు వెళ్ళడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న పెద్ద అంశం. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘాన్ లో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ విషయంలో మొదటి నుంచి అమెరికా వైఖరిని భారత్ సమర్ధిస్తూ వస్తోంది. తాలిబన్ ఉగ్రవాద ప్రభుత్వాన్ని సమర్ధించే విషయంలో ఇప్పటికి ఇంకా భారత్ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపధ్యంలో అమెరికాలో భారత ప్రధాని పర్యటన ఉండొచ్చనే వార్తలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.