Covid Vaccination: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు
Covid Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ ..

Covid Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే టీకా ప్రారంభించిన రోజే ప్రతి సెంటర్‌లో 100 మందికి టీకా ఇవ్వనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వీడియో కార్ఫరెన్స్ ద్వారా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. 1075 కాల్ సెంటర్‌ల ద్వారా కోవిడ్ టీకా పంపిణీ సందేహాలను నివృత్తి చేయనున్నారు అధికారులు. తగినన్ని డోసుల కోవిషీల్డ్, కోవాగ్జిన్ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ నెల 16నుంచి చేపట్టే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొదటి విడతలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో భాగంగా ఆరోగ్య సిబ్బందితో పాటు వృద్ధులకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం డీసీజీఐ ద్వారా అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’, సీరం ఇనిస్టిట్యూట్ ‘కొవిషీల్డ్’కు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.
భారత్ బయోటెక్ 55 లక్షల కోవాగ్జిన్ మోతాదులను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 38.5 లక్షల మోతాదుకు రూ .295 చొప్పున చెల్లించేలా మిగిలిన 16.5 లక్షలు ఉచితంగా సరఫరా చేయడానికి భారత బయోటెక్ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా అయ్యాయి. గురువారం నాటికి సీరం ఇనిస్టిట్యూట్ 1.1కోట్ల డోసులు, భారత్ బయోటెక్ 55లక్షల డోసులను అందించనున్నాయి. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ నుంచి దేశవ్యాప్తంగా 13 నగరాలకు 54.72లక్షల డోసులను కేంద్రం తరలించింది. ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్, భువనేశ్వర్‌కు చేరగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు. ఇప్పటికే అధికారులు టీకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.