AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: డిజిటల్ అగ్రికల్చర్‌తో భవిష్యత్తులో పెనుమార్పులు.. సేంద్రీయ సాగుపై దృష్టి పెట్టాలిః ప్రధాని

హైదరాబాద్‌లోప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇక్రిశాట్‌ 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

PM Modi: డిజిటల్ అగ్రికల్చర్‌తో భవిష్యత్తులో పెనుమార్పులు.. సేంద్రీయ సాగుపై దృష్టి పెట్టాలిః ప్రధాని
Modi Icrisat Speech
Balaraju Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 05, 2022 | 4:46 PM

Share

PM Narendra Modi: హైదరాబాద్‌లోప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇక్రిశాట్‌ (icrisat) 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్ ఎంతో శ్రమించిందని ప్రధాని నరేంద్ర మోడీ అభినందనల వర్షం కురిపించారు. ప్రకృతి సాగుకు, డిజిటల్ విధానంలో వ్యవసాయ విధానాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. సాగులో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని చెప్పారు. పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. నిల్వ వసతులు పెంచుతామని అన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని.. అందరికీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు

దేశంలో నదుల అనుసంధానాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగకరంగా.. నీటి వనరులను అభివృద్ధి చేయనున్నామన్నారు. దేశంలో వాతావరణంలో కలుగుతున్న మార్పులు.. చిన్న రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాతావరణ మార్పులపై ఇతర దేశాలు కూడా తగిన విధంగా స్పందించాలని కోరిన విషయాన్ని ప్రధాని మోడీ.. ఇక్రిశాట్ వేదికపై గుర్తు చేశారు. డిజిటల్ వ్యవసాయం అన్నది భారత భవిష్యత్తుగా ప్రధాని మోడీ చెప్పారు. నైపుణ్యం ఉన్న యువత.. ఈ దిశగా అడుగులు వేయాలన్నారు. క్రాప్ అసెస్ మెంట్, భూ రికార్డుల డిజిటలైజేషన్, సాగులో డ్రోన్ల వినియోగం వంటి చర్యలు అమలు కానున్నట్టు మోడీ చెప్పారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వ ఉన్నాతాధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కుఇక్రిశాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొని.. ప్రత్యేక లోగోను ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం పంటల క్షేత్రాన్ని సందర్శించారు. అలాగే శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.

మొక్కల సంరక్షణపై ICRISAT యొక్క వాతావరణ మార్పు పరిశోధన కేంద్రం ICRISAT రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ సెంటర్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ICRISAT లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. స్మారక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. ICRISAT అనేది ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అభివృద్ధి కోసం వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసే అంతర్జాతీయ సంస్థ అని ఇక్రిశాట్ డైరక్టర్ జాక్వెలిన్ డి ఆరోస్ వెల్లడించారు.

భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇక్రిశాట్ కృషీ అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి ఇతర దేశాలకు సహాయం చేయడంలో ICRISATకి 5 దశాబ్దాల అనుభవం ఉందన్నారు. 2070 నాటికి వ్యవసాయ రంగంలో భారత్ నికర-సున్నా లక్ష్యాన్ని నిర్దేశించిందని ఆయన చెప్పారు. పర్యావరణం కోసం జీవనశైలి అవసరాన్ని కూడా హైలైట్ చేసామన్నారు. ప్రో ప్లానెట్ పీపుల్ మూవ్‌మెంట్‌కు కూడా పిలుపునిచ్చామన్నారు.

ప్రదర్శననను తిలకించిన ప్రధాని Icrisat ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. శాస్త్రవేత్తలను కొత్త అవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాలు సజ్జ, కంది, శెనగ, వేరుశెనగ తదితర ధాన్యాల సాగు గురించి ప్రధాని ఆరా తీశారు. అనంతరం ప్రధాని మోడీని ఇక్రిశాట్ డైరక్టర్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. ఈ సందర్భంగా గత 50 యేళ్లలో ఇక్రిశాట్ సాధించిన పురోగతిపై ప్రధాని మోడీకి శాస్త్రవేత్తలు వివరించారు. అంతేకాకుండా కొత్త వంగడాల రూపకల్పనలో సాధిస్తున్న ఫలితాలను, రైతులకు అందిస్తున్న అంశాలను వివరించారు. మెట్ట పంటలపై ఇక్రిశాట్ అనేక పరిశోధనలు చేస్తున్నట్లు ఇక్రిశాట్ డైరక్టర్ జాక్వెలిన్ డి ఆరోస్ తెలిపారు. మెట్ట పంటలపై వాతావరణ మార్పుల ప్రభావంపై మరింత విశ్లేషణాత్మక పరిశోధనలు జరుగుతున్నట్లు జాక్వెలిన్ డి ఆరోస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్ర తోమర్, కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ పాల్గొన్నారు.

సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్‌ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. అనంతరం 8.20 గంటలకు ముచ్చింతల్‌ ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.