తుదిదశకు కేబినెట్ విస్తరణ కసరత్తు? కీలక సమావేశం రద్దు.. ఢిల్లీకి చేరుకుంటున్న ఎంపీలు

తుదిదశకు కేబినెట్ విస్తరణ కసరత్తు? కీలక సమావేశం రద్దు.. ఢిల్లీకి చేరుకుంటున్న ఎంపీలు
Union Cabinet

PM Modi's Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. మోడీ కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలన్న విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం.

Janardhan Veluru

|

Jul 06, 2021 | 12:39 PM

PM Modi’s Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. మోడీ కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలన్న విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కొందరు ఎంపీలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో సదరు ఎంపీలు తమ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి పయనమవుతున్నారు. పార్టీ ఫిరాయించి మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కారకుడైన  జ్యోతిరాధిత్య సింథియా మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్నారు. ఢిల్లీ నుంచి తనకు అందిన సమాచారం మేరకు ఇండోర్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అలాగే ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన  జనతా దళ్(జేడీయు)కి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. జేడీయు నేత సీపీ సింగ్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఆయన్ను కేంద్ర కేబినెట్‌లో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎల్జేపీ(పరాస్ వర్గం), ఆప్నా దళ్‌కు కూడా కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు సమాచారం.

కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర ఇవాళ సాయంత్రం నిర్వహించాల్సిన కీలక సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్వ్వవస్థీకరణపై చర్చించేందుకు సీనియర్ మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కావాలని ప్రధాని మోడీ ముందుగా భావించారు. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేసుకుంటూ మంగళవారం ఉదయం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమైన ప్రధాని మోడీ…కేంద్ర కేబినెట్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్ర కేబినెట్‌లో గరిష్ఠంగా 81 మందికి చోటు కల్పించేందుకు వీలుంది. ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. మరో 28 మందిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు వీలుంది. తక్కువలో తక్కువ 20 మంది కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.  నరేంద్ర మోడీ రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపడుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం. 2022లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. యూపీ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రకు కేబినెట్ విస్తరణలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలుస్తోంది.  అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు చేరుకుంటున్నారు.

పనితీరు సరిగ్గా లేని కొందరి మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్‌ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్‌ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నారు.

Also Read..

 నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. SBIలో 6100 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు… చివరి తేదీ ఎప్పుడంటే..

మాట నిలబెట్టుకున్న రియల్ హీరో… నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్ పంపిన సోనూసూద్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu