PM Modi: ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత లీడర్‌గా మోదీ.. ట్రంప్‌కు ఎన్నో స్థానమంటే..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నేతగా మోదీ తొలిస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్ సర్వేలో ప్రధాని మోదీకి అగ్రస్థానం కేటాయించారు. మోదీకి 75 శాతం మంది మద్దతు లభించినట్టు...

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నేతగా మోదీ తొలిస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్ సర్వేలో ప్రధాని మోదీకి అగ్రస్థానం కేటాయించారు. మోదీకి 75 శాతం మంది మద్దతు లభించినట్టు వెల్లడించారు. 44 శాతం మద్దతుతో ఎనిమిదో స్థానంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.
అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. జూలై 4 నుంచి 10వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. సర్వే వివరాలను ‘మార్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసింది.ఈ సర్వేలో ప్రధాని మోదీకి ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. అంటే సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది మోదీని ప్రజాస్వామ్య ప్రపంచ నేతగా ఆమోదిస్తూ ఓటు వేశారు. 18 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపలేదు. మిగతా 7 శాతం మంది ఏమీ చెప్పలేకపోతున్నామన్నారు.
సర్వే రిపోర్టులో అత్యంత విశ్వసనీయ ప్రపంచ నాయకుల్లో మోదీ తొలి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో నిలిచారు. ఇక అర్జెంటీనా అధినేత జేవియర్ మిలీకి మూడో స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్లు సర్వే రిపోర్టుల ద్వారా స్పష్టమైపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
