Narendra Modi: అడుగడుగు అంబేద్కర్ బాటలోనే.. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రధాని మోదీ నిరంతర కృషి..
PM Narendra Modi: మన జాతీయ హీరోలను గుర్తించడంలో ప్రధాని మోదీకి తిరుగులేదు. ఆయన నిబద్ధత అలాంటిది. వారిలో రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అంటే ప్రధానికి ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన మార్గమే భారతదేశ ఎదుగుదలకు శిరోధార్యమని నమ్మిన వ్యక్తి మోదీ. మహనీయుడు అంబేద్కర్ పేరును చిరస్థాయిగా నిలిపేందుకు.. ప్రధాని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

Narendra Modi: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు.. బలహీనవర్గాల గొంతుక. అణగారిన జాతుల ఆశాజ్యోతి. ఆయన రాజ్యాంగాన్ని రచించిన సమయంలో ఏవైతే కలలు కన్నారో.. ఎలాంటి ఆదర్శాలతో దేశాన్ని నడిపించాలని అనుకున్నారో.. వాటన్నింటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలను శాశ్వతంగా కొనసాగించడానికి ప్రధాని మోదీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.
అంబేద్కర్ ఆశయాల్లో ఒకటైన.. సమసమాజ స్థాపన కోసం ప్రధాని ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జన్ ధన్ నుంచి ముద్ర వరకు ఎన్నో స్కీమ్స్‌ను అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లారు. ఇక పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వాటితోపాటు.. సమానత్వం వంటి అంశాలలోనూ మోదీ ప్రభుత్వం పట్టువదలకుండా నిరంతర కృషి చేస్తోంది. పరిశ్రమల స్థాపన కోసం.. మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకురావడం.. అంతేకాదు.. కార్పొరేట్ పన్నులలో గణనీయమైన తగ్గింపులు.. కార్మిక చట్టాల సవరణలతో సహా వివిధ సంస్కరణలు.. దేశాన్ని ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాయి. ఇప్పుడు మన గోల్ టాప్3లో ఉండడమే.
ఇక అంబేద్కర్ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడంలో ప్రధాని మోదీ ఎంతో నిబద్దతను కనబరుస్తున్నారు. ‘మన్ కీ బాత్’లో పలుమార్లు తన ఆలోచనలు పంచుకున్నారు. భారతదేశాన్ని పారిశ్రామిక శక్తిగా చూడాలన్న డాక్టర్ అంబేద్కర్ కలలతో ‘మేక్ ఇన్ ఇండియా’ను రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా, స్టార్టప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా వంటి కార్యక్రమాలు కూడా ఆ కోవలోకి వచ్చేవే. ఈ కార్యక్రమాలు ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావడంలో ఎంతో తోడ్పడుతున్నాయి. కరెంటు, రోడ్లు, రైల్వేలు, ఎయిర్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా బాబాసాహెబ్ కలను నెరవేర్చడానికి ప్రధాని మోదీ ఎంతో శ్రద్ధతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా, సౌభాగ్య వంటి కార్యక్రమాలు నిరుపేద కుటుంబాలకు విద్యుత్తు సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
అలాగే దేశంలోని ప్రతీ ఇంటికి నీరు అందేలా చూడాలని అంబేద్కర్ ఆనాడే సంకల్పించారు. ఆ ప్రేరణతోనే.. జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్‌ను అందించాయి. ఇక విద్యావ్యవస్థలో NEP 2020 ద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అత్యంత అణగారిన వర్గాలకు విద్యను అందించాలనే అంబేద్కర్ దార్శనికతను సాకారం చేయాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష. దేశంలో స్త్రీ, పురుష సమానత్వం కోసం మహిళల పురోగతికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది మోదీ సర్కార్. ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచడంతో సహా మహిళల సాధికారత కోసం పిఎం మోదీ గణనీయమైన సంస్కరణలను అమలు చేశారు.
ప్రధానిగానే కాదు.. గతంలోనూ ఆయన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1987లో, గుజరాత్‌లో బిజెపి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరవాత గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ భవన్‌లను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంవిధాన్ యాత్రను ఘనంగా నిర్వహించారు. అంతేకాదు.. గుజరాత్‌లో ‘న్యాయ్ యాత్ర’ కూడా నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంలో ముఖ్యమైన ప్రదేశాలను స్మరించుకుంటూ పంచతీర్థం అభివృద్ధి చేశారు PM మోదీ. ఇందులో మోవ్‌లోని అంబేద్కర్ జన్మస్థలం, లండన్‌లోని నివాసం, నాగ్‌పూర్‌లోని దీక్షా భూమి, ఢిల్లీలోని మహాపరినిర్వాన్ స్థల్, ముంబైలోని చైత్య భూమి ఉన్నాయి. వీటితోపాటు.. అనేక కార్యక్రమాలు చేపట్టారు మోదీ.