PM Modi: వర్షాకాలానికి ముందే ‘మిషన్ అమృత్ సరోవర్’ పనులు పూర్తికావాలి.. 9 కీలక ప్రాజెక్టులపై ప్రధాని మోడీ సమీక్ష..
PM Modi 41st PRAGATI Interaction: నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.

PM Modi 41st PRAGATI Interaction: నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంతో ప్రధాని మోడీ పలు పథకాలకు శ్రీకారం చుట్టి.. వాటి ప్రగతిపై అధికారులతో భేటీ అవుతూ వస్తున్నారు. దీనిలో భాగంగా, బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ICT ఆధారిత బహుళ-మోడల్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రగతి 41వ ఎడిషన్ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 13 రాష్ట్రాలలో చేపడుతున్న రూ.41,500 కోట్లకు సంబంధించిన తొమ్మిది కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక కోసం PM GatiShakti పోర్టల్‌ని ఉపయోగించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సలహా ఇచ్చారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అమృత్ సరోవర్ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
ఈ సమావేశంలో తొమ్మిది కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సమీక్షించారు. తొమ్మిది ప్రాజెక్టులలో మూడు ప్రాజెక్టులు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి, రెండు ప్రాజెక్టులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి, విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక్కొక్క ప్రాజెక్ట్ పై సమీక్షించారు. ఈ తొమ్మిది ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 41,500 కోట్లు. ఈ ప్రాజెక్టులు ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్.. 13 రాష్ట్రాలకు సంబంధించినవి. ఈ సమావేశంలో మిషన్ అమృత్ సరోవర్ పై కూడా ప్రధాని సమీక్షించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక కోసం ప్రధాన మంత్రి గతిశక్తి పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన మంత్రి సూచించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు భూసేకరణ, వినియోగ బదలాయింపు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని సూచించారు.




ప్రగతి ఇంటరాక్షన్ సందర్భంగా.. ప్రధాన మంత్రి మోడీ ‘మిషన్ అమృత్ సరోవర్’ ప్రాజెక్టుపై కూడా సమీక్షించారు. బీహార్‌లోని కిషన్‌గంజ్, గుజరాత్‌లోని బొటాడ్‌లోని అమృత్ సరోవర్ సైట్‌కు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను మోడీ ఈ సందర్భంగా వీక్షించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అమృత్ సరోవర్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన మంత్రి సూచించారు. మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్టు కింద 50,000 అమృత్ సరోవర్ ప్రాంతాలను పరిశీలించడమే లక్ష్యంగా బ్లాక్ లెవల్ మానిటరింగ్ చేయాలని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.
‘మిషన్ అమృత్ సరోవర్’ ప్రత్యేకమైన ఆలోచన దేశవ్యాప్తంగా ఉన్న నీటి వనరులను పునరుజ్జీవింపజేయడానికి కృషి చేస్తోందని.. ఇది భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించడంలో సహాయపడుతుందని మోడీ తెలిపారు. మిషన్ పూర్తయిన తర్వాత, నీటి నిల్వ సామర్థ్యంలో అంచనా పెరుగుదల సుమారు 50 కోట్ల క్యూ.మీ., అంచనా వేసిన కార్బన్ సీక్వెస్ట్రేషన్ సంవత్సరానికి 32,000 టన్నులు, భూగర్భ జలాల రీఛార్జ్‌లో 22 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా పెరుగుతుందని అంచనా. అంతేకాకుండా, పూర్తి చేసిన అమృత్ సరోవర్లు కమ్యూనిటీ కార్యకలాపాలు, భాగస్వామ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని.. తద్వారా జన్ భగీదారి స్ఫూర్తిని మెరుగుపరుస్తుందని మోడీ తెలిపారు. అమృత్ సరోవర్స్ సైట్లలో స్వచ్ఛతా ర్యాలీ, నీటి సంరక్షణపై జల్ షపత్, రంగోలి పోటీ వంటి పాఠశాల పిల్లల కార్యకలాపాలు, చత్ పూజ వంటి మతపరమైన పండుగల వేడుకలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రధాని మోడీ ఈ ప్రగతి సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం రూ.15.82 లక్షల కోట్లతో 328 ప్రాజెక్టులను సమీక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




