Parliament: పార్లమెంట్ లోపలికి ఎలా వెళ్లగలిగారు? తమ ప్లాన్‌ను ఎలా అమలు చేశారు? దర్యాప్తులో సంచలనాలు!
పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వారు రెండు వ్యూహాలను పన్నినట్లు చెప్పాడు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు.

పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వారు రెండు వ్యూహాలను పన్నినట్లు చెప్పాడు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు. ప్లాన్ ఏ ప్రకారం నీలం, అమోల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించకపోతే మరోవైపు నుంచి మహేశ్, కైలాష్ ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ చెప్పాడు. పొగ బాంబులను మండించి నినాదాలు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నాడు. మహేష్, కైలాష్ గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇంటిని చేరుకోవడంలో ఎలాగైనా పని పూర్తి చేయాలని అమోల్, నీలమ్‌లకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించాడు.
పార్లమెంట్‌లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ షిండే, విశాల్, లలిత్, మహేశ్ అనే ఏడుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ షిండే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు.
మరోవైపు లోక్‌సభలో దుండగులు అలజడి సృష్టించిన ఘటనను ఢిల్లీ పోలీసులు సీన్ రీక్రియేట్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పార్లమెంట్‌కు తీసుకెళ్లి శని లేదా ఆది వారాల్లో ఈ సీన్ రీక్రియేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను తప్పించుకుని నిందితులు గ్యాస్ కానిస్టర్లతో పార్లమెంట్ లోపలికి ఎలా వెళ్లగలిగారు? లోక్‌సభలో తమ ప్లాన్‌ను ఎలా అమలు చేశారు? వంటివి తెలుసుకునేందుకు ఈ రీక్రియేషన్ ఉపయోగపడుతుందని స్పెషల్ సెల్ విభాగ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…