Parliament Monsoon Session: ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. మోదీ సర్కార్‌ను కట్టడి చేసేందుకు విపక్షాల ప్లాన్ ఇదే..
Parliament Monsoon Session: ప్రతిపక్షాలు దూకుడు పెంచాలని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం సమస్యపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు హాట్ హాట్‌గా ప్రారంభమైంది. మరోసారి ప్రతిపక్షాలు దూకుడు పెంచాలని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం సమస్యపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నిరసన చేపట్టనుంది. అంతకుముందు సోమవారం వర్షాకాల సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం, పాలు, పెరుగుతో సహా కొన్ని ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను (GST) విధించడం, అగ్నిపథ్ పథకం, కొన్ని ఇతర సమస్యలపై ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలలో గందరగోళం సృష్టించాయి. గందరగోళం కారణంగా ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా వాయిదా పడిన అనంతరం సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
17వ లోక్ సభ తొమ్మిదో సెషన్ లో సభ.. 18 రోజులు పని చేస్తుందని.. మొత్తం 108గంటల పాటు.. ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు, ఇంధన సంరక్షణ సవరణ బిల్లు, కుటుంబ న్యాయస్థాన సవరణ బిల్లులు ప్రధానమైనవి. వీటితో పాటు సంక్షేమ సవరణ బిల్లు, సహకార సంఘాల సవరణ బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు- 2022 ఈ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. సెంట్రల్ యూనివర్శిటీల సవరణ బిల్లు- 2022 కూడా ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. అధికార పార్టీ ఎలాంటి అంశాలను లేవనెత్తనుంది? ఇప్పటికే జరిగిన ఆల్ పార్టీ మీటింగులో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తాయో చూడాలి.
విపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
పార్లమెంట్ సమావేశాల సమయాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల సభ్యులను అభ్యర్థించారు. వివిధ విషయాలపై ఓపెన్ మైండ్‌తో చర్చించి, చర్చలు జరపాలని, అవసరమైతే వాటిని విమర్శించాలని, తద్వారా పాలసీ, నిర్ణయాల్లో చాలా సానుకూల సహకారం అందించవచ్చని ప్రధాని మోదీ విపక్షాలను కోరారు.