Parliament: నేటి నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు.. అస్త్రశస్ర్తాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు.. చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే..!
ఇవాళ్టి నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 29 సాధారణ బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులను ఉభయ సభల ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది.
Parliament Monsoon Session 2021: ఇవాళ్టి నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 29 సాధారణ బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులను ఉభయ సభల ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. ఇందులో మూడు బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకురావడానికి ఉద్దేశించినవి. ‘రక్షణ ఉత్పత్తుల సంస్థల్లో పనిచేస్తున్నవారు నిరసనలు తెలుపకూడదు’ అన్న వివాదాస్పద బిల్లు కూడా ఈ జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే, సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించేలా కేంద్రానికి అధికారం కల్పించే కొత్త సినిమాటోగ్రఫీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, కరోనా కట్టడి, మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో కేంద్రం వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అలాగే, వ్యవసాయ చట్టాలు, సరిహద్దుల్లో చైనా దూకుడుపై మాటల దాడి చేయడానికి ప్రతిపక్షాలు అస్ర్తాలను సిద్ధం చేసుకొంటున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించాయి. అయితే, అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన, అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఇప్పిటకే క్లారిటీ ఇచ్చారు. ఇక, ఈ సమావేశాల సమయంలో పార్లమెంటు వద్ద రైతులు తమ నిరసనగళం వినిపిస్తారని కిసాన్ సంయుక్త మోర్చా ఇదివరకే ప్రకటించింది.
వర్షకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఆదివారం అఖిల పక్ష భేటీ జరిగింది. సమావేశానికి 33 పార్టీలు హాజరయ్యాయి. ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు విపక్షాల నేతలు అఖిలపక్షంలో డిమాండ్ చేశారు. కాగా, ఆదివారం ఎన్డీయే ఫ్లోర్ లీడర్లతో ప్రధాని భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సి వ్యుహంపై దిశానిర్ధేశం చేశారు.
మరోవైపు, కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. 280 మంది మాత్రమే లోక్‌సభ ప్రధాన చర్చ ప్రాంగణంలో కూర్చొంటారు. మరో 259 మంది సందర్శకుల గ్యాలరీలో కూర్చొంటారు. రాజ్యసభలోనూ ఇదే ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ, లోక్‌సభ రెండింట్లో ఒకేసారి, ఉదయం 11 గంటల నుంచి చర్చలు ప్రారంభమవుతాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తామని, కరోనా కట్టడిపై మోదీ రెండు సభలను ఉద్దేశించి సోమవారం ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిల పక్షంలో ప్రతిపాదించారు. దీనిని ప్రతిపక్ష పార్టీల నేతలు తిరస్కరించారు. పాత పద్ధతిలోనే సమావేశాలు కొనసాగాలని సూచించారు.
సెషన్‌లో సామాజిక దూరాన్ని కొనసాగించే అన్ని కోవిడ్ సంబంధిత ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇంకా టీకాలు తీసుకోని వారు పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో RT-PCR పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదు పొందిన వారు ఆర్టీ-పీసీఆర్ పరీక్షను చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, లోక్‌సభ నుండి 444 మంది , రాజ్యసభ నుండి 218 మంది సభ్యులు కనీసం ఒక్క డోస్ టీకాలు వేయించారు. అలాగే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా సందర్శకులకు అనుమతి లేదని స్పీకర్ కార్యాలయం తెలిపింది.
ఇదిలావుంటే, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి పార్లమెంటు మూడు సమావేశాల సమయాన్ని తగ్గించారు. గత సంవత్సరం వింటర్ సెషన్ ఏకంగా రద్దు చేయాల్సి వచ్చింది. సాధారణంగా జూలైలో ప్రారంభమయ్యే వర్షకాల సమావేశాలు.. మహమ్మారి పరిస్థితి కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది.