మౌని అమావాస్య తొక్కిసలాటపై వీ వాంట్ ఆన్సర్.. పార్లమెంటులో విపక్షాల ఉడుంపట్టు
మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటపై మౌనంగా ఉండాలని విపక్షం ఎంతమాత్రమూ అనుకోవడం లేదు. వీ వాంట్ ఆన్సర్ అంటూ పార్లమెంటులో ఉడుంపట్టు పట్టారు. ఈ అంశంపై పార్లమెంటులో దుమారం రేగింది.తొక్కిసలాటపై జవాబు చెప్పాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు విపక్ష ఎంపీలు. ఇందుకు యూపీ సీఎం యోగిదే బాధ్యత అనీ, ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లు చెప్పాలని

మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటపై మౌనంగా ఉండాలని విపక్షం ఎంతమాత్రమూ అనుకోవడం లేదు. వీ వాంట్ ఆన్సర్ అంటూ పార్లమెంటులో ఉడుంపట్టు పట్టారు. ఈ అంశంపై పార్లమెంటులో దుమారం రేగింది.తొక్కిసలాటపై జవాబు చెప్పాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు విపక్ష ఎంపీలు. ఇందుకు యూపీ సీఎం యోగిదే బాధ్యత అనీ, ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లు చెప్పాలని పట్టుబట్టాయి. అయితే కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని పంపింది ప్రశ్నలు అడగాలనేగానీ.. బల్లలు విరగ్గొట్టాలని కాదు అంటూ స్పీకర్ తప్పుబట్టారు. ఇదే అంశంపై రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి.
మహాకుంభ్ జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 2 దగ్గర జనవరి 29న రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. అమృత స్నానం కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన బారికేడ్లు విరిగిపోయాయి. బారికేడ్ విరగడంతో పక్కనే నిద్రిస్తున్నవారిపై జనం పడిపోయారు. ఒకరిమీద ఒకరు పడిపోవటంతో చీకట్లో తొక్కిసలాట జరిగింది. ఆ గందరగోళంలో కిందపడినవాళ్లను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. పరిస్థితిని నియంత్రించేసరికి 30 మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో జరిగిందీ ఘటన.
ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటతో యూపీ సర్కార్‌పై విమర్శల దాడి చేస్తున్నాయి విపక్షాలు. సరైన ఏర్పాట్లు లేకపోవడం, నిర్వహణాలోపం వల్లే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. మహాకుంభమేళాలో సామాన్యభక్తులకన్నా VIPలకు ప్రాధాన్యమివ్వడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు రాహుల్. కుంభమేళా ఏర్పాట్లను సైన్యానికి అప్పగించాలన్నారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించామని యోగి ప్రభుత్వం ప్రచారాన్ని ఊదరగొట్టిందన్నారు. తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.