గ్రామ పంచాయతీకి పంపిన నిధులు అన్నీ మాయం.. ఎంక్వైరీ చేయగా తేలిన షాకింగ్ నిజం
చావిట్లో నలుగురు కూర్చుని గుట్టుగా ఆడుకునే జూదం అనేది ఒకప్పుడు లోకల్. ఇప్పుడది ఇంటర్నేషనల్. నిన్నటిదాకా అది గల్లీల్లో పేకాట. డిజిటల్ లైఫ్ మొదలయ్యాక బాగా ముదిరి.. ఆన్‌లైన్‌లోకొచ్చింది. అది ఎంతలా ముదిరిందంటే.. కార్పొరేట్ వ్యవస్థను సైతం డామినేట్ చేసేంతలా. అవును ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది పెద్ద జాడ్యంలా తయారయ్యింది. తాజాగా ఓ ఒడిశా ప్రభుత్వ అధికారి రూ.3 కోట్ల ప్రభుత్వ సొమ్ము బెట్టింగ్ కోసం తగలేశాడు.

ఒడిశాలోని కలహండి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ కోసం రూ. 3 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పిఇఒ)ను రాష్ట్ర విజిలెన్స్ అరెస్టు చేసింది. అరెస్టయిన PEO ను దేబానంద సాగర్ గా గుర్తించారు. కలహండి జిల్లాలోని తుమాల్-రాంపూర్ బ్లాక్ పరిధిలోని తల్నేగి గ్రామ పంచాయతీ, పొడపాదర్ గ్రామ పంచాయతీల నుంచి రూ.3.26 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన నిధులను సాగర్ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేసుకున్నాడని ధృవీకరించారు. “ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కోసం అతను ప్రభుత్వ డబ్బును ఉపయోగించాడు” అని విజిలెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతానికి మన దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కి సంబంధించి జాతీయస్థాయిలో నిర్దిష్టమైన చట్టం లేదు. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద దృష్టి పెట్టి.. కఠినమైన చట్టాలు చెయ్యడానికి నడుం కడుతోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఒక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన జరుగుతోంది. కానీ.. బెట్టింగ్ యాప్స్‌లో విదేశీ కంపెనీలే ఎక్కువ. మన దేశ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాటికి వర్తించవు. సో.. ఎంతమంది అప్పులపాలైనా ఎన్ని చావులు నమోదైనా.. బిందాస్‌గా రెచ్చిపోతాయి బెట్టింగ్ యాప్స్. వాళ్లను ప్రమోట్ చేసే సెలబ్రిటీలకూ బ్రేకులేసే ఛాన్సుల్లేవ్.
వెధవ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా తాగితే పోతావ్ అని స్టిక్కరేస్తారు. ఐనా తాగుతున్నారు.. అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌ల మేటరూ అంతే. వాళ్లు వల విసరడం ఆపరు.. దాన్ని కంట్రోల్ చేసే ప్రభుత్వాలూ ఇప్పట్లో మేలుకోవు… ఏతావాతా.. చెప్పొచ్చేదేంటంటే.. జిందగీల్ని నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లాలా.. వద్దా లాగిన్ కావాలా.. లాగౌట్ చేయాలా.. అనేది యూజర్లే తేల్చుకోవాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.