HIGH COURT: ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్‌పై సంచలన తీర్పు… హైకోర్టు తీర్పుతో దంపతుల షాక్
ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారికి పోలీస్ భద్రత ఎందుకివ్వాలి? అని ధర్మాసనం ప్రశ్నించింది. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని...

ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారికి పోలీస్ భద్రత ఎందుకివ్వాలి? అని ధర్మాసనం ప్రశ్నించింది. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని కోర్టు భావిస్తే అప్పుడు మీకు పోలీసులు భద్రత కల్పిస్తారు అంటూ అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రేమవివాహం చేసుకున్న దంపతుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఓ కీలక తీర్పునిచ్చింది.
తల్లిదండ్రులను ఎదిరించి తాము ప్రేమవివాహం చేసుకున్నాం, వారి నుంచి ప్రాణభయం ఉందంటూ శ్రేయా కేసర్వాని అనే మహిళ తన భర్తతో కలిసి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు పోలీసు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. మీ జీవితానికి, మీ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెదిరింపులు వస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు. కేవలం తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని రక్షణ కోరడం తగదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దంపతులకు ప్రాణ భయమేమీ లేదని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, పైగా వారి బంధువులు ఎటువంటి మానసిక లేదా శారీరక హానిని కలిగించే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు..ప్రేమ పెళ్లి చేసుకున్న యువతకు కేవలం రక్షణ కల్పించేందుకు మాత్రమే న్యాయస్థానాలు లేవు అంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసింది.
దంపతులు తమకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి రక్షణ కోరుతూ వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని ఆ దంపతులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పోలీసులను కోర్టు ఆదేశించింది. సామాజికంగా ఎదురయ్యే సమస్యలను దంపతులు ఎదుర్కొవాల్సి ఉంటుదని చెప్పింది. పరస్పరం అండగా ఉండడం నేర్చుకోవాలని దంపతులకు ధర్మాసనం సూచించింది.
