AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌కు రాకుంటే పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.

T20 World Cup 2026 : బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
Bcci
Rakesh
|

Updated on: Jan 10, 2026 | 9:30 AM

Share

T20 World Cup 2026 : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ మాత్రం తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని పట్టుబడుతోంది. ఈ వివాదం వెనుక అసలు కథ ఐపీఎల్ వేలంతో మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను వదిలేయాలని బీసీసీఐ ఆదేశించింది. పొరుగు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

ముస్తాఫిజుర్‌ను పంపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్, తమ ఆటగాళ్లకు భారత్‌లో రక్షణ ఉండదని ఆరోపిస్తూ ఐసీసీకి రెండు లేఖలు రాసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలోని కొలంబోకు మార్చాలని కోరింది. అయితే బెంగళూరులో జరిగిన ఒక సమావేశం తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ అభ్యర్థనలో పస లేదని తేల్చి చెప్పారు. ఐసీసీ కూడా బంగ్లాదేశ్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. భారత్‌లో భద్రతా పరమైన ముప్పు ఏమీ లేదని, షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ భద్రత కారణాలు చెబుతూ భారత్‌కు రాకపోతే, ఆ మ్యాచ్ పాయింట్లను ప్రత్యర్థి జట్లకు కేటాయిస్తామని ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం. పాకిస్థాన్ కోసం అమలు చేసిన హైబ్రిడ్ మోడల్ తమకు కూడా వర్తింపజేయాలని బంగ్లాదేశ్ కోరినప్పటికీ, ఐసీసీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బీసీసీఐ ఇప్పటికే క్రీడాకారులకు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది.

బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశ గౌరవాన్ని పణంగా పెట్టి భారత్‌లో ఆడబోమని ఆయన ప్రకటించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిషేధించారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఐసీసీ అధ్యక్షుడు జై షా నేతృత్వంలో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ మొదలుకానుండటంతో, బంగ్లాదేశ్ తన తుది నిర్ణయాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి