Jemimah Rodrigues : బ్యాట్ పడితే పరుగులు.. గిటార్ పడితే పాటలు..జెమీమా-గవాస్కర్ జుగల్బందీ అదిరింది
Jemimah Rodrigues : లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, టీమ్ ఇండియా స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌కు బ్యాట్ ఆకారంలో ఉన్న స్పెషల్ గిటార్ ను బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరూ కలిసి పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jemimah Rodrigues : భారత క్రికెట్ చరిత్రలో సునీల్ గవాస్కర్ పేరు వినగానే మనకు ఆయన అద్భుతమైన బ్యాటింగ్ గుర్తుకు వస్తుంది. అయితే ఆయనలో ఒక మంచి గాయకుడు, అంతకంటే మంచి వ్యక్తి ఉన్నాడని మరోసారి నిరూపితమైంది. మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు ఆయన గతంలో ఒక మాట ఇచ్చారు. మహిళల వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తే, జెమీమాతో కలిసి మ్యూజిక్ సెషన్‌లో పాల్గొంటానని ప్రామిస్ చేశారు. తాజాగా ఆ మాటను గవాస్కర్ నిలబెట్టుకున్నారు.
జెమీమా కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఆమె అద్భుతంగా గిటార్ వాయిస్తూ పాటలు పాడుతుంది. ఆమెలోని ఈ కళను గుర్తించిన గవాస్కర్, ఆమె కోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేయించారు. అది చూడటానికి క్రికెట్ బ్యాట్ లాగే ఉంటుంది కానీ, అది ఒక గిటార్. దీనిని బ్యాట్-ఆర్ అని పిలుస్తున్నారు. ఈ వినూత్నమైన గిఫ్ట్ చూసి జెమీమా షాక్ అయ్యింది. “దీనితో బ్యాటింగ్ చేయాలా? లేక వాయించాలా?” అని ఆమె అడగ్గా.. “నువ్వు రెండూ చేయగలవు, నీ బ్యాటింగ్‌లో కూడా ఒక రిథమ్ ఉంటుంది” అని గవాస్కర్ తనదైన శైలిలో కితాబిచ్చారు.
కేవలం గిఫ్ట్ ఇవ్వడమే కాదు, ఇద్దరూ కలిసి ఒక పాట పాడారు. షోలే సినిమాలోని ప్రసిద్ధ యే దోస్తీ హమ్ నహీ తోడేంగే.. పాటను గవాస్కర్, జెమీమా కలిసి పాడుతుంటే పక్కన ఉన్నవారంతా మంత్రముగ్ధులయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను జెమీమా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. “సునీల్ సార్ తన ప్రామిస్ నిలబెట్టుకున్నారు. కూలెస్ట్ బ్యాట్-గిటార్‌తో మేము చిల్ అయ్యాం. ఇది నాకు చాలా స్పెషల్” అని రాసుకొచ్చింది.
జెమీమా రోడ్రిగ్స్ ఇటీవల ముగిసిన ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 127 పరుగులతో వీరోచిత పోరాటం చేసి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ఆ ఫామ్‌ను ఆమె ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌తో జెమీమా తన కెప్టెన్సీ ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. ఈ క్రమంలో గవాస్కర్ వంటి లెజెండ్ నుంచి ప్రశంసలు, గిఫ్ట్ అందడం ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
