Bhagavat Gita: నిజంగా కన్నయ్య లీలే.. భగవద్గీత చదివాడు.. గుడిలో దొంగలించిన సొమ్ముని 9 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేశాడు
దొంగల్లోనూ నిజాయితీ దొంగలు ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఓ దొంగ.. తొమ్మిదేళ్ల క్రితం దోచుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. అంతే కాదు.. నేరానికి పాల్పడినందుకు గానూ తనకు తాను జరిమానా విధించుకుని, దాన్ని కూడా చెల్లించాడు.
కష్టపడి పనిచేసి ఉన్నదానితో బతకాలి అన్న ఆలోచనకంటే.. దొంగ తనం చేసి.. అందిన కాడికి దోచుకుని జల్సాగా బతకాలనే వారు ఎక్కువ అయ్యారు. అందుకు తాళం వేసిన ఇళ్లను మాత్రమే కాదు.. గుడి, బడి ఇలా అన్నిటిలోనూ దొంగతనం చేస్తున్న సంఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కొందరు నీచులు దేవుడి గుడిలోకి చొరబడి హుండీలోని సొమ్ముని ఎత్తుకెళ్ళడం, నగలు, వస్తువులు దొంగలించడం వంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఓ దొంగ ఆలయంలోని ఆభరణాలను దొంగలించి.. తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశాడు. ఈ వింత ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది..
ఒడిశాలోని గోపినాథ్‌పూర్‌లోని ఓ ఆలయంలోకి తొమ్మిదేళ్ల క్రితం వెళ్లాడా దొంగ. ఆ సమయంలో యజ్ఞం చేస్తుండగా, ఖరీదైన ఆభరణాలను అపహరించాడు. ఆ ఆభరణాలను దొంగిలించినప్పటి నుంచి అతడు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు.. ఎదుర్కొంటూనే ఉన్నాడట. దీంతో తాను దొంగిలించిన ఆభరణాలను ఆ దేవుడి పాదాల చెంతకు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇక సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకుని ఖరీదైన ఆభరణాలను ఆలయంలో ఉంచినట్లు దొంగ ఓ నోట్‌లో పేర్కొన్నాడు.
దొంగిలించిన ఆభరణాలతో పాటు ఆ దొంగ.. కొంత డబ్బును ఆలయానికి విరాళంగా కూడా ఇచ్చాడు. ఆభరణాల బ్యాగులో 301 రూపాయలు ఉంచాడు. అందులో 201 విరాళం కాగా, నేరానికి పాల్పడినందుకు తనకు తాను విధించుకున్న శిక్షగా 300 రూపాయలు జరిమానా కింద చెల్లించినట్లు దొంగ తెలిపాడు. అయితే ఈ నోట్‌లో అతని పేరు, ఊరు వివరాలు ఎలాంటివి తెలియపరచలేదు. దొంగ అపహరించిన ఆభరణాల ఖరీదు లక్షల్లో ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
బ్యాగ్‌లో దొంగిలించబడిన టోపీ, చెవిపోగులు, చెవి కమ్మలు, బంగారు గొలుసు, కిరీటం, బ్రాస్‌లెట్, కృష్ణుడు రాధలకు చెందిన వేణువు ఉన్నాయి. ఈ ఆభరణాల విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు. కృష్ణా, రాధ విగ్రహాలకు చెందిన ఆభరణాలు మళ్లీ తిరిగి దొంగ ఇచ్చేయడం అద్భుతం అని ఆలయ పూజారి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇండియా టుడేలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి ఇటీవల భగవద్గీతను చదివాడు. తాను చేసిన పని తప్పు అని గ్రహించినట్లు తెలుస్తోంది. 2014లో ఆలయంలో భారీ చోరీ జరిగింది. అప్పుడు దేవతల వెండి వేణువు, గొడుగు, కిరీటం, వెండి కన్నులు, పళ్లెం, గడియారం చోరీకి గురయ్యాయి. ఆ సమయంలో గ్రామస్తులు లింగరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోజుల తరబడి వెతికినా చోరీకి గురైన వస్తువులు దొరకకపోవడంతో గ్రామస్తులు ఆశలు వదులుకున్నారు. అయితే, ఆభరణాలు తిరిగి దేవాలయంలోకి చేరుకోవడంతో గ్రామంలో వేడుకలు జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..