AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: కొత్త ముఖాలు.. కొత్త సమీకరణాలు.. మూడు రాష్ట్రాల్లో ఊహకందని బీజేపీ వ్యూహాలు..

ఆ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ముఖ్యమంత్రుల ఎంపికలో ఊహకందని నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా సామాజిక సమీకరణాలతో ఎత్తులు వేస్తోంది. మూడు రాష్ట్రాల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన వర్గాలకు పెద్దపీట వేస్తూ..

BJP: కొత్త ముఖాలు.. కొత్త సమీకరణాలు.. మూడు రాష్ట్రాల్లో ఊహకందని బీజేపీ వ్యూహాలు..
BJP
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Dec 12, 2023 | 8:20 AM

Share

ఆ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ముఖ్యమంత్రుల ఎంపికలో ఊహకందని నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా సామాజిక సమీకరణాలతో ఎత్తులు వేస్తోంది. మూడు రాష్ట్రాల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన వర్గాలకు పెద్దపీట వేస్తూ.. సామాజిక సమతూకం పాటిస్తూ సుదీర్ఘ పాలనానుభవం కలిగిన నేతలను సైతం పక్కనపెట్టేస్తోంది. అందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక. గిరిజన-ఆదివాసీల రాష్ట్రంగా పేరొందిన చత్తీస్‌గఢ్‌లో ఆ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ఆ రాష్ట్రానికి మొట్టమొదటి గిరిజన సీఎంను అందించిన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వరుసగా 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్‌తోనే కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ పేరును ప్రతిపాదించేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోనూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఇక్కడ దాదాపు 2 దశాబ్దాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కాదని కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో తదుపరి రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని స్పష్టమైపోయింది. అక్కడ కూడా రెండు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజకుటుంబీకురాలు వసుంధరా రాజే ఉన్నప్పటికీ.. మరో కొత్త ముఖం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం కనిపిస్తోంది.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ బీజేపీ ఏ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు ముందు ప్రకటించలేదు. ప్రధాని మోడీ పేరు, గత తొమ్మిదనరేళ్లుగా ఆయన అందించిన పరిపాలన చూసి ఓటేయమంటూ ప్రచారం నిర్వహించింది. డబులింజన్ సర్కారుతోనే అభివృద్ధి రెట్టించిన వేగంతో ముందుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి ఈ మూడు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బలమైన నేతలున్నారు. వారినే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎక్కడా ప్రకటించలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తదుపరి జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా కొత్తవారికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పిస్తోంది. బీజేపీలో ఇదేమీ కొత్త కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకట్రెండు సామాజికవర్గాల చేతిలోనే ముఖ్యమంత్రి పదవి మారుతూ వచ్చింది. ఈ విధానానికి స్వస్తి చెబుతూ అగ్ర పీఠం అందుకోలేకపోయిన ఇతర సామాజికవర్గాలకు కూడా అవకాశం కల్పిస్తూ వచ్చింది. జాట్ సామాజికవర్గం ఆధిపత్యం ప్రదర్శించే హర్యానాలో జాటేతర నేత మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి ఆశ్చర్యపరిచింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో కొత్త ముఖాలకు చోటు కల్పించింది.

ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల వాటా..

రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో 2003 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి ఆదివాసీ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయికి అగ్ర పీఠం దక్కింది. అతను రమణ్ సింగ్‌కు సన్నిహితుడు. విష్ణుకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. దేశంలో గిరిజన-ఆదివాసీ జనాభా 9 శాతం ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లో వారి సంఖ్య 31 శాతం. అందుకే ఈ రాష్ట్రం గిరిజన-ఆదివాసీలకు నిలయంగా పేరొందింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీల జనాభా గణనీయంగా ఉంది. విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా గిరిజన జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దళిత, గిరిజన వర్గాలకు భారత రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవులే కాదు, రాజ్యాధికారంలోనూ భాగస్వాములను చేయడం బీజేపీతోనే సాధ్యం అన్న సంకేతాలు పంపించింది. అదే సమయంలో జన సంఖ్య ఎక్కువగా ఉన్న ఓబీసీ సామాజికవర్గం నుంచి ఒకరిని, పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రులుగా చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. తద్వారా ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ-ఓబీసీ-బ్రాహ్మణ అనే బలమైన సమీకరణాన్ని రూపొందించడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ సమీకరణాల ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తోంది.

ముఖం మారినా.. మధ్యప్రదేశ్‌లో ఓబీసీల చేతికే..

మధ్యప్రదేశ్‌లో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓటు వేశారు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓబీసీల మద్దతుతో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వెనుకబడిన వర్గాల నుంచే వచ్చారు. ఆయన కంటే ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఓబీసీలే. ఇదే సాంప్రదాయాన్ని, సమీకరణాలను కొనసాగిస్తూ ఈసారి కూడా మోహన్ యాదవ్‌ను అనూహ్యంగా తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. నిజానికి మధ్యప్రదేశ్‌లో బలమైన ఓబీసీ నేతల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ పటేల్, కైలాష్ విజయవర్గియా, రాకేష్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కూడా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీజేపీ ఓబీసీని ముఖ్యమంత్రిగా చేస్తే.. ఈ నలుగురిలో ఎవరి పేరునైనా ఆమోదించవచ్చని తొలుత అందరూ భావించారు. కానీ బీజేపీ సీనియర్లను పక్కనపెట్టి కొత్త ముఖానికి అవకాశం కల్పించింది. దళిత-రాజ్‌పుత్‌ల నుంచి ఒక్కో డిప్యూటీ సీఎం ఫార్ములాను అమలు చేయవచ్చని చర్చ జరుగుతోంది. 2018లో 29 లోక్‌సభ స్థానాలకు గాను 28 ఎంపీలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి మొత్తం 29 స్థానాల్లో బీజేపీ గెలుపొందాలని భావిస్తోంది.

రాజస్థాన్‌లో బీజేపీ సీఎం ఎవరు?

వసుంధర రాజే రాజస్థాన్‌లో బీజేపీకి అత్యంత శక్తివంతమైన నాయకురాలు. అయితే ఈసారి ఆమె పేరిట రాలేదు. ప్రధాని మోడీ పేరు మీద జరిగిన ప్రచారంతోనే విజయం సాధ్యపడింది. రాజస్థాన్‌లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అందుకే ఎనిమిది రోజులుగా కొత్త సీఎం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంగళవారం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశానికి ముందు, వసుంధర రాజే తన బలాన్ని ప్రదర్శించే పనిలో నిమగ్నమై ఉన్నారు, దీని కోసం ఆమె నిరంతరం ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. రాజస్థాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో మొత్తం ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందాన్ని నియమించింది. మంగళవారం ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. బీజేపీలో సీఎం రేసులో గజేంద్ర సింగ్ షెకావత్, సీపీ జోషి, అశ్విని వైష్ణవ్, మహంత్ బాలక్‌నాథ్, దియా కుమారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన సీఎం, మధ్యప్రదేశ్‌లో ఓబీసీకి రాజ్యాధికారం అప్పగించిన బీజేపీ రాజస్థాన్‌లో అగ్రవర్ణ వర్గానికి అధికారం అప్పగించవచ్చని తెలుస్తోంది. ఈ రాజకీయ సమీకరణలన్నింటిని పరిశీలిస్తున్న బీజేపీ ఆ విషయంలో తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో రాజ్‌పుత్‌ (క్షత్రియ) వర్గానికి చెందిన షెకావత్ పేరు, బ్రాహ్మణ వర్గానికి చెందిన సీపీ జోషి ప్రధానంగా చర్చలో ఉన్నాయి. వారితో పాటు బ్యూరోక్రాట్‌గా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్‌ను కూడా అధిష్టానం పరిశీలించే అవకాశం లేకపోలేదు. భవిష్యత్ నాయకత్వాన్ని సిద్ధం చేయడంపై పార్టీ దృష్టి సారించింది. యువతను ఆకట్టుకోవాలంటే కొత్త తరానికి అవకాశం కల్పించడమే అసలైన మార్గమని కమలనాథులు భావిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల్లో 83 సీట్లకు 65 బీజేపీవే..

అసెంబ్లీ ఎన్నికల రాజకీయ ప్రాముఖ్యత కేవలం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాజకీయాలకే పరిమితం కాదు. 2024 ప్రారంభంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి ప్రీ-ఫైనల్స్ వంటివి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి మిషన్-2024 కోసం టెన్షన్‌ను పెంచగా, బీజేపీ నైతిక స్థైర్యాన్ని పెంచాయి. 2014, 2019లో వరుసగా విజయం సాధించిన బీజేపీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో విజయం బీజేపీకి రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చింది.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలతో కలిసి I.N.D.I.A పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఐక్యతను చాటలేకపోయింది. తద్వారా ఈ మూడు హిందీ రాష్ట్రాలలో బీజేపీ – కాంగ్రెస్ మధ్యనే ప్రత్యక్ష పోరు నెలకొంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందగా, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ను ఓడించింది.

దేశంలో మొత్తం 545 లోక్‌సభ స్థానాలు ఉండగా, అందులో 83 స్థానాలు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకున్న ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 83 సీట్లలో 65 సీట్లు బీజేపీ ఎంపీలవే అంటే దాదాపు 78 శాతం సీట్లు బీజేపీకి దక్కాయి. కాంగ్రెస్‌కు ఆరు సీట్లు మాత్రమే ఉండగా, ఏఐఎంఐఎం ఒక సీటు, ఆర్‌ఎల్‌పీ ఒక సీటు, బీఆర్‌ఎస్ 9 సీట్లు గెలుపొందాయి. ఇంత స్కోర్ చేసిన ఈ 5 రాష్ట్రాల్లో ఈసారి గతం కంటే ఎక్కువ సీట్లు గెలుపొందాలని భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలతో అడుగులు వేస్తోంది.