Corona Vaccinations: దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్.. దేశ వ్యాప్తంగా 1,37,56,940 మందికి కరోనా వ్యాక్సిన్
Corona Vaccinations: దేశంలో ఏడాదిగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించింది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్రంగా వ్యాప్తించింది. అయితే ఇటీవల..
Corona Vaccinations: దేశంలో ఏడాదిగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించింది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్రంగా వ్యాప్తించింది. అయితే ఇటీవల కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రావడంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలోఇప్పటి వరకు కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 1.37 కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతెలిపింది. శుక్రవారం వరకు మొత్తం దేశ వ్యాప్తంగా 1,37,56,940 మంది లబ్దిదారులకు కరోనా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే ఐదు రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో శుక్రవారం అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిందని పేర్కొంది.
గడిచిన 24 గంటల్లో ఎవరూ ఆస్పత్రిలో చేరలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే బీహార్‌కు చెందని 41 ఏళ్ల వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత స్వల్ప అస్వస్థతకు గురై పదిహేను రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతు శుక్రవారం మరణించినట్లు తెలిపింది. ఆ వ్యక్తి మరణానికి, టీకాకు ఎలాంటి సంబంధం ఉందన్న దానిపై పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందని కేంద్రం తెలిపింది.
అపోహాలు నమ్మవద్దు:
కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని, టీకా తీసుకుంటే ఏదో జరుగుతుంది, చనిపోతున్నారంటూ వస్తున్న పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ విజయవంతంగానే కొనసాగుతోందని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని తెలిపింది. మృతి చెందిన కొందరు ఇతర కారణాల వల్లే చనిపోయారని, వ్యాక్సిన్ తీసుకున్నందుకు కాదని స్పష్టం చేసింది. దేశంలో కరోనాను అరికట్టేందుకు పరిశోధకులు ఎంతగానే శ్రమించి వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారని, కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. దేశంలో మరి కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, అంతేకాకుండా భారత్‌లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు కూడా సరఫరా చేశామని, అక్కడ మంచి ఫలితాలే వస్తున్నాయని అన్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే పూర్తి చర్యలు చేపట్టామని, అన్ని వర్గాల వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే దేశంలో కరోనాను కట్టడి చేయడం జరిగిందని, అలాగే యూకే స్ట్రెయిన్ వైరస్ కూడా దేశంలో వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని చెబుతోంది.