CM Stalin: పొలిటికల్ స్పైస్ మిస్సైంది..! హుందాతనమైన రాజకీయ పరిమళాల ఆస్వాదనలో తమిళ తంబీలు.?

తమిళనాడు ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి పొలిటికల్ రివేంజ్. తమిళ రాజకీయాల్లో ఉండే వేడి మరెక్కడా చూడలేం. నాటి అన్నా దురై నుంచి.. నిన్నటి కరుణానిధి, జయలలిత దాకా ఆరవ రాజకీయాల తీరే వేరు..

CM Stalin: పొలిటికల్ స్పైస్ మిస్సైంది..! హుందాతనమైన రాజకీయ పరిమళాల ఆస్వాదనలో తమిళ తంబీలు.?
CM Stalin

మురళి చెన్నూరు, సీనియర్ కరస్పాండెంట్, టీవీ9

Tamil Nadu Politics: తమిళనాడు ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి పొలిటికల్ రివేంజ్. తమిళ రాజకీయాల్లో ఉండే వేడి మరెక్కడా చూడలేం. నాటి అన్నా దురై నుంచి.. నిన్నటి కరుణానిధి, జయలలిత దాకా ఆరవ రాజకీయాల తీరే వేరు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అధికారంలో ఉన్నది డీఎంకే ప్రభుత్వమే కదా.. అంటారా..? ఛాన్సే లేదు.. నిన్నటి దాకా ఉన్న పాలిటిక్స్ వేరు.. నేటి రాజకీయ పరిస్థితి వేరు. ఎందుకంటే అక్కడ సీఎం స్టాలిన్. అందరూ ఊహించింది ఒకటి. అక్కడ జరుగుతోంది మరోటి.. దీంతో తమిళ రాజకీయాల్లో ఎదో మిస్సయిందట.

ముత్తువేలు కరుణానిధి స్టాలిన్ అనే నేను అన్న మాట స్టాలిన్ నోట వచ్చిన తర్వాత ఏముంది.? కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ చిరునామాగా ఉన్న గడ్డ.. ఆ గడ్డపై మునుపటి స్పైస్ లేక.. ముందెన్నడూ లేని కొత్త తరహా పాలనతో స్టాలిన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడట. ఎక్కడైనా ఐదేళ్లకోసారి ఎన్నికలొస్తాయి.. అక్కడ ఎన్నికల్లో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుంది. అలా మారిన ప్రతి సారి ప్రతిపక్షానికి అధికార పక్షం చుక్కలు చూపిస్తుంది. 2001లో జయలలిత అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫ్లై ఓవర్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ విచారణకు ఆదేశించింది. అంతటితో ఊరుకుందా..! రాజకీయ కురువృద్ధుడు కరుణానిధిని అరెస్టు చేయించింది. అది కూడా అర్ధరాత్రి. అది మాత్రమే కాదు లాఠీలతో కొట్టుకుంటూ.. అప్పట్లో అది దేశం మొత్తం మీద సంచలనం.

ఇక, 2006 లో మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్జింది. జయలలితపై అక్రమాస్తుల కేసు.. ఐటీ దాడులు.. వందల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలు.. 2008లో జయలలిత అరెస్టు. ఇలా ఎన్నో.. ప్రభుత్వం మారితే ఎవరు ఎప్పుడు .. ఎలాంటి కేసులు ఎదుర్కోవలసి వస్తుందోనన్న పరిస్థితి తమిళనాట షరా మామూలుగా ఉండేది.

ఇప్పుడు కాలం మారింది.. పొలిటికల్ లెజెండ్స్ గా పిలవబడే కలైంజర్, పురచ్చి తలైవి ఇప్పుడు లేరు. వారు లేకపోయినా ఆ రెండు ద్రవిడ పార్టీల మధ్య వైరం ఎక్కడికి పోతుంది అనుకున్నారంతా.. స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన ట్వీట్ సారాంశం చూసిన వారికి అదే అనిపించింది. అదేంటంటే తాను ద్రవిడ రాజకీయాలకు చెందిన వాడినని తన ట్విట్టర్ ఉపోద్ఘాతంలో ప్రకటించడం.. డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై 1962లో పార్లమెంటులో చేసిన తన తొలి ప్రసంగంలో ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో స్టాలిన్ కూడా అదే ఫందా తో ముందుకు వెళతారని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. సీఎం అయ్యాక తీసుకున్న కీలక నిర్ణయాలే తార్కాణంగా ఉన్నాయి.

డీఎంకే అంటే.. హేతువాదాన్ని ఎక్కువగా బలపరుస్తుంది అన్న ప్రచారం ఉంది. అలాంటిది ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆలయాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీలు, ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. అప్పటి దాకా కరుణానిధి కుటుంబం పట్ల ఉన్న అభిప్రాయం మారింది. అలాగే డీఎంకే పైనా అలాగే .. స్టాలిన్ పాలన పై ఉన్న అభిప్రాయాలను మారిపోయాయి. దేశంలో ఎక్కడా లేనన్ని ఉచిత పథకాలు తమిళనాడులోనే పురుడు పోసుకున్నాయి. వాళ్ళు ఒకటి ఇస్తే మేము రెండు ఇస్తాం అన్నంతగా పోటీ పడి పథకాలను ప్రవేశపెట్టాయి డీఎంకే, ఎడిఎంకే. అయితే ప్రభుత్వం మారితే పథకాలు మారేవి. ఒక వేళ ఉన్నా వాటి పేర్లు మారిపోవడం ఖాయం. కానీ ఇప్పుడు అలా కాలేదు.

ఇక రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రజా సమస్యలపై స్టాలిన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్’ అనే పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సమస్యలపై వేలాదిగా అర్జీలు వస్తున్నాయి. 100 రోజుల్లో పరిష్కారం అంటూ ప్రకటించారు. ఇందుకోసం ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు.

ఇక కొవిడ్ నిర్మూలనకు భిన్నంగా ముందుకు వెళుతున్నారు సీఎం స్టాలిన్. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి వారి సలహాలు తీసుకున్నారు. అంతే కాదు.. గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి గా పనిచేసిన విజయ్ భాస్కర్ ను కొవిడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ లోకి తీసుకున్నారు. గత ప్రభుత్వం లో కీలకంగా పనిచేసిన అధికారులను కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 2.07 కోట్ల మంది రేషన్ కార్డుదారులందరికీ రూ. 4000 నగదు సహాయం విడుదలకు సంబంధించిన ఫైలుపై స్టాలిన్ మొదటి సంతకం చేశారు. తొలి విడతగా ఇప్పటికే చెల్లించారు. ప్రైవేటు ఆసుపత్రులలో కొవిడ్ రోగులు చేయించుకునే చికిత్స ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం కింద భరించాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్రాన్ని కరోనా సెకండ్ వేవ్ పట్టిపీడిస్తున్న సమయంలో అత్యంత కీలక నిర్ణయం గా మన్ననలు పొందారు.

ఆర్టీసీ ఆర్డినరీ సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ మరో నిర్ణయం ఆవిన్ (ప్రభత్వ సంస్థ) పాల ధరను లీటర్ వద్ద రూ. 3 తగ్గించడం.. మొన్నటి ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నింటినీ మొదటి వంద రోజుల్లో నెరవేర్చడానికి నిర్ణయించి అందుకు ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేశారు.. కొవిడ్ వారియర్స్ ని ఆడుకోవడం లోనూ స్టాలిన్ ప్రతి ఒక్కరికి సాయం అందేలా చూడడం.. కోవిడ్ వారియర్స్ లిస్ట్ లో జర్నలిస్టులను కూడా చేర్చి అందరితో సమానంగా 5 వేలు అందించడం.. ఇలా ప్రతి వర్గాన్ని స్టాలిన్ టచ్ చేయగలిగారు.

ఇక నిత్యం ప్రజల్లో ఉండడం.. గతంలో కరుణానిధి, జయలలిత ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది ప్రజల అభిప్రాయం. అలాంటిది ఇపుడు స్టాలిన్ నిత్యం ప్రజల్లో ఉండడం.. సామాన్యుల పెళ్లిళ్లకు వెళ్ళడం.. రాజకీయ వైరాల జోలికి అస్సలు వెళ్లక పోవడం.. దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేయడం.. అన్నా డీఎంకే నేతలపై ఫిర్యాదు వస్తే అధికారులు అత్యుత్సాహం ఆపి.. తప్పు జరిగిందన్న నిర్ధారణకు వచ్చాక మాత్రమే విచారణకు వెళ్లాలని చెప్పడం ప్రతిపక్ష నేతలు సైతం హర్షించే విషయాలుగా మారిపోయాయి.

Read also: Pawan Kalyan: ప్రజల నాయకుడు వి. హనుమంతరావు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Click on your DTH Provider to Add TV9 Telugu