KTR: రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే.. కేటీఆర్ స్పందన ఇదే

తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పక్కరాష్ట్రాల్లోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఫిదా అవుతున్నారు. అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

KTR: రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే.. కేటీఆర్ స్పందన ఇదే
Karnataka Bjp Mla
Follow us

|

Updated on: Oct 12, 2021 | 2:54 PM

కన్నడ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్‌ నోట.. తెలంగాణ ప్రగతి మాట ప్రతిధ్వనించింది. అవును తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమానికి ఫిదా అయ్యారాయన. అందుకే కర్నాటకలోని రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పక్కరాష్ట్రాల్లోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఫిదా అవుతున్నారు. అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. సీఎం కేసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ ప్రాంతాలను కూడా తెలంగాణలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారు. శివరాజ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

‘తెలంగాణ ప్రగతికి సరిహద్దులు దాటి వస్తున్న ధ్రువీకరణ. కర్ణాటక బీజేపీ ఎంఎల్‌ఏ రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.  ఆయన సూచనను ప్రజలు చప్పట్లతో స్వాగతించారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ సరిహద్దుని ఆనుకుని ఉంటుంది రాయచూర్‌ జిల్లా. నిజానికి ఇక్కడి ప్రజలు చాలా రోజులుగా తెలంగాణలో కలవాలనే ఆకాంక్షను సందర్భం వచ్చినప్పుడల్లా చాటుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారాయి. రాయచూర్‌ జిల్లాలోని శక్తినగర్‌, కల్మల, మల్మరి, గుంజనహళ్లి ప్రాంతాల ప్రజలకు తెలంగాణతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అయితే అక్కడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు తమకు చేరడం లేదని.. అందుకే తెలంగాణలో కలవాలని చాలారోజులు కోరుకుంటున్నారు. ఒక్క రాయచూర్‌ మాత్రమే కాదు ఇంతకుముందు నాంధేడ్ ప్రజలు కూడా తెలంగాణలో తమను కలుపుకోవాలని ఆందోళనకు దిగారు. అలాగే పోలవరం ముంపు మండలాల ప్రజలు కూడా తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.

తెలంగాణతో ఇటు మహారాష్ట్ర, అటు కర్నాటక మధ్య ఎప్పుడో అప్పుడు వివాదం నడుస్తూనే ఉంది. కానీ సరిహద్దు ప్రాంత ప్రజలు మాత్రం తెలంగాణలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. తమ కోరికను బయటపెడుతూనే ఉన్నారు. కాగా కన్నడ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తుంటే.. అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

Also Read: Coronavirus: థర్డ్ వేవ్ ముప్పు ఇంకా పోలేదు.. ఇదే డేంజర్ సమయం.. తస్మాత్ జాగ్రత్త