Manish Sisodia: నన్నూ రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారు.. అయినా భయపడేది లేదు: ఢిల్లీ డిప్యూటీ సీఎం
బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశ ప్రజలు ఆమ్‌ఆద్మీ పార్టీని చూస్తున్నారని అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని సిసోడియా ఆరోపించారు.
Manish Sisodia CBI Raids: ఢిల్లీలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని.. కావాలనే తనను ఇరికించేందుకు ప్లాన్ చేశారని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. తప్పుడు కేసులో తనను సీబీఐ లేదా ఈడీ రెండు లేదా నాలుగు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము భగత్ సింగ్ వారసులమని, అరెస్ట్‌లకు భయపడేది లేదంటూ సిసోడియా పేర్కొన్నారు. తనతో పాటు ఆప్ నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశముందని తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశ ప్రజలు ఆమ్‌ఆద్మీ పార్టీని చూస్తున్నారని అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్‌ను చూసి బీజేపీ భయపడుతోందని.. అందుకే మమ్మల్ని టార్గేట్ చేశారంటూ విమర్శించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆప్ ఢీకొడుతుందన్నారు. ఢిల్లీలో వేల కోట్ల ఎక్సైజ్ స్కాం జరిగిందని బీజేపీ నేతలంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్ 140 కోట్ల స్కాం జరిగిందని నివేదిక ఇచ్చినట్లు పేర్కొంటున్నారని సిసోడియా తెలిపారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కేవలం కోటి రూపాయల స్కాం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపారు.
ఎక్సైజ్ స్కాంలో మనీష్‌సిసోడియా నివాసంలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సిసోడియా ల్యాప్‌టాప్‌తో పాటు సెల్‌ఫోన్‌ను, పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..