గర్భిణీ భార్య పరీక్ష కోసం.. 1200కి.మీలు స్కూటర్‌పై

ఆమె ఓ గర్భవతి. కానీ తన కోరిక ప్రకారం టీచర్ అవ్వాలంటే పరీక్ష రాయాలి. పోని పరీక్ష సెంటర్‌ దగ్గర్లో ఉందా..! అంటే అదీ లేదు.

  • Tv9 Telugu
  • Publish Date - 1:12 pm, Sat, 5 September 20
గర్భిణీ భార్య పరీక్ష కోసం.. 1200కి.మీలు స్కూటర్‌పై

Man rides wife: ఆమె ఓ గర్భవతి. కానీ తన కోరిక ప్రకారం టీచర్ అవ్వాలంటే పరీక్ష రాయాలి. పోని పరీక్ష సెంటర్‌ దగ్గర్లో ఉందా..! అంటే అదీ లేదు. 1200కి.మీల దూరంలో ఆమెకు పరీక్ష సెంటర్ పడింది. ప్రజారవాణా లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లోనైనా అక్కడకు వెళ్లాలనుకుంది. అయితే అందుకు వారు భారీగా డబ్బులను అడిగారు. దీంతో ఆమె భర్త ఓ నిర్ణయానికి వచ్చారు. తన భార్య కోరికను ఎలాగైనా తీర్చాలని అనుకున్నారు. రెండు రోజుల పాటు బైక్‌పై 1200కి.మీలు ప్రయాణించి భార్యను పరీక్షా కేంద్రానికి చేర్చారు. దీంతో అటు భార్య సంకల్పానికి, ఇటు భర్త ప్రోత్సహానికి సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన ధనంజయ్‌ కుమార్‌ భార్య సోని హెంబ్రామన్‌ గర్భవతి. టీచర్ కావాలన్న లక్ష్యంతో ఆమె ప్రాథమిక డిప్లమా కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు పరీక్షా కేంద్రం పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌లో వచ్చింది. దీంతో ఎలా వెళ్లాలి అని ఆలోచించి భార్యభర్తలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. సోనిని స్కూటర్‌పై తీసుకెళ్లడానికి ధనుంజయ్‌ సిద్దమయ్యాడు. అయితే పెట్రోల్ పోయించుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. సోని తన నగలను తాకట్టు పెట్టింది. ఇద్దరూ రెండు రోజుల పాటు జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాల గుండా ప్రయాణించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.

దీనిపై ధనుంజయ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. బీహార్‌లోని వరదలను దాటుకుంటూ వచ్చాం. చాలా చోట్ల వర్షంలో తడిచాము. ఓ రాత్రి టోల్‌ ప్లాజా వద్ద ఆశ్రయం పొందాం. ఆర్థిక కష్టాలతో నేను 8వ తరగతి వరకే చదువుకోవాల్సి వచ్చింది. అందుకే నా భార్యను టీచర్‌గా చూడాలనేది నా కోరిక. భార్య జ్ఞాపకార్థం పర్వతాన్ని తవ్వి రోడ్డు నిర్మించిన దశరథ్ మాంజీనే నాకు ప్రేరణ” అని వెల్లడించారు. మరోవైపు సోని మాట్లాడుతూ.. ” మా ప్రయాణంలో కాళ్లు మొద్దుబారాయి. నడుము నొప్పి, కడుపు నొప్పితో బాధపడ్డా. అయినా వెనకడుగు వేయలేదు. నా కోసం ఇంత కష్టపడిన నా భర్తకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని వెల్లడించారు. కాగా లాక్‌డౌన్‌కి ముందు ధనంజయ్ ఓ క్యాంటిన్‌లో పనిచేసేవాడు. లాక్‌డౌన్ సమయంలో అతడి ఉద్యోగం పోయినట్లు వారు తెలిపారు.

Read More:

నటి ఇంట్లో నర్సు చేతివాటం.. బంగారం చోరీ

యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక రైలు