Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాను భయపెడుతున్న చిరుతలు.. ఏడాదిన్నరలో 25మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. బిజ్నోర్ జిల్లాను చిరుతపులులు భయపెడుతున్నాయి. అయితే.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిరుతల దాడుల్లో 25మంది ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ గణాంకాలు చెప్తుండడం కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను కొద్ది నెలలుగా తోడేళ్లు వణికిస్తున్నాయి. తోడేళ్ల గుంపు జనాలపై దాడులు చేస్తున్నా ప్రాణాలు తీసేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. యూపీలోని బిజ్నోర్ జిల్లాకు సంబంధించిన చిరుతల విషయం వెలుగులోకి వచ్చింది. జనావాసాల సమీపంలో చిరుతల సంచారం, దాడులతో బిజ్నోర్ జిల్లా ప్రజలు ఏడాదిన్నరగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతుల వణికిస్తున్నాయి. బిజ్నోర్ సమీపంలో 500 వరకు చిరుతలు ఉన్నాయని యూపీ అటవీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
బిజ్నోర్‌కు చెందిన పిలానా ప్రాంతం ఎప్పుడూ జనాలతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు వారంతా సాయంత్రం కాగానే ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. 2023లో చిరుత దాడితో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని స్థానికులు చెప్తున్నారు. ఊరికి 15కిలో మీటర్ల దూరంలో దట్టమైన అడవిలో చిరుతలు భాగా ఉంటాయని.. కానీ వాటి దాడులతో ఏడాది కాలంగా జనజీవనం అంతా తారుమారయిందని ఆవేదన చెందుతున్నారు. ఇది ఒక్క గ్రామం పరిస్థితి కాదని గుర్తించిన అధికారులు..
బిజ్నోర్‌లోని సుమారు 85 గ్రామాలను హైపర్ సెన్సిటివ్ కేటగిరిలోకి చేర్చారు. అవన్నీ అటవీ ప్రాంతానికి 8కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మ్యాన్ ఈటర్ చిరుతలను బంధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్థానికులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ఊరట లేకుండా పోయింది. వాటిని బంధించేందుకు 107 బోన్లు ఏర్పాటు చేశారు. పొలాలకు వెళ్లేటప్పుడు ఒక్కరే వెళ్లొద్దని.. ఫక్షన్లు, రేడియోల్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు. చీకట్లో బయటకు వెళ్లొదని హెచ్చరించారు.
ప్రస్తుతం ఆయా ప్రయత్నాల్నీ కొనసాగుతున్నప్పటికీ.. గత నెల 29న మరో వ్యక్తిని మ్యాన్ ఈటర్ చిరుత దాడి చేయడంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో.. ఏడాదిన్నర కాలంలో మృతుల సంఖ్య 25 చేరడం బిజ్నోర్ జిల్లాలోని 85 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా.. ఒకవైపు తోడేళ్ల దాడులు ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతుంటే.. మరోవైపు చిరుతల దాడులు వణికిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..