Maharashtra Politics Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఠాక్రే ప్రభుత్వానికి ముచ్చెమటలు..!
Maharashtra Politics Crisis: మరాఠాలో రాజకీయ సంక్షోభం రాజుకుంది. చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం పొంచి వుంది. షిండే రూపంలో పొలిటికల్ క్రైసిస్ సమీపిస్తోన్న విషయాన్ని ముఖ్యమంత్రి..
Maharashtra Politics Crisis: మరాఠాలో రాజకీయ సంక్షోభం రాజుకుంది. చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం పొంచి వుంది. షిండే రూపంలో పొలిటికల్ క్రైసిస్ సమీపిస్తోన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి కంటి మీద కునుకులేకుండా చేసింది. ఎస్.. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. శాసన మండలి ఎన్నికల్లో అఘాడీ కూటమి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అదే ఒరవడి ప్రభుత్వానికి ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో కంగారుపడ్డ శివసేన ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన వెంటనే అసలు కథ మొదలైంది.
అగాడీ కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన, ఎన్సీపీ చెరో రెండు ఎమ్మెల్సీ సీట్లు సంపాదించగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడు కలిసి ఐదు స్థానాలు గెలుచుకుంటే, భారతీయ జనతాపార్టీ ఒక్కటే 5 స్థానాల్లో విజయం సాధించడం మహారాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. భారతీయ జనతాపార్టీ బలం అంతంత మాత్రమే అయినా స్వతంత్ర అభ్యర్థులు సైతం బీజేపీకే ఓట్లు వేయడంతో పాటు అగాడీ కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే ఇప్పుడు శివసేన సహా కూటమిలో కల్లోలం సృష్టిస్తోంది.
ఏక్‌నాథ్ షిండే వర్గం ఠాక్రే ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. షిండే నాయకత్వంలో ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమైన విషయం తెల్లారేసరికి తేటతెల్లమైంది. దీంతో ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ విషయంపై ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరు కాకుండా షిండే వర్గం గుజరాత్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం అందింది. సమావేశం సమాచారం విషయాన్ని ఏక్‌నాథ్ షిండేకి చేరవేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం మరట్వాడా పొలిటికల్ హీట్‌ని చెప్పకనే చెపుతోంది. మంగళవారం శివసేనకు చెందిన 17 మంది మంది ఎమ్మెల్యేలు గుజరాత్ చేరుకున్నారు. దీంతో ఉద్దవ్‌ఠాక్రే ప్రభుత్వం చిక్కుల్లో పడిపోయింది.
ఈ రోజు ముఖ్యమంత్రి ఠాక్రే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌షిండేతో కలిసి సూరత్ హోటల్‌లో ఉన్నారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. షిండేతో పాటు శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే శివసేనలో చీలికలు మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సూరత్‌కు చెందిన పెద్ద నాయకులు చక్రం తిప్పుతున్నారు. మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల తర్వాత తాజాగా శాసన మండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘాడికి గట్టి దెబ్బ తగిలింది. మహారాష్ట్ర లెజిస్టేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి మొత్తం 134 ఓట్లు వచ్చాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. స్పష్టమవుతోంది.
దేవేంద్ర ఫడ్నవీస్ ఏమన్నారంటే..
శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించడం మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార ఎమ్మెల్యేల్లో అస్థిరతను సూచిస్తోందని మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఐదు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. అన్ని స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ విజయం ఖాయమైందని ఫడ్నవీస్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి