డ్యూటీ చేయకుండానే.. 12 ఏళ్లుగా రూ.28 లక్షల జీతం తీసుకున్న పోలీస్! కళ్లుమూసుకున్న సర్కార్..
ఓ పోలీస్ కానిస్టేబుల్ 12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లడం లేదు. అయినప్పటికీ ప్రతి నెల జీతం మాత్రం అందుకున్నాడు. అలా ఏకంగా రూ.28 లక్షలకుపైగా నెల జీతం తీసుకున్నాడు. తాజాగా పోలీస్ శాఖ నిర్వహించిన ఇంటర్నల్ తనిఖీల్లో 12 ఏళ్ల తర్వాత ఈ వ్యవహారాన్ని గుర్తించింది. ఈ విచిత్ర మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

భోపాల్, జులై 7: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి 2011లో కానిస్టేబుల్‌గా నియమాకమయ్యాడు. తొలుత భోపాల్ పోలీస్ లైన్స్‌లో అతడ్ని నియమించారు. అయితే విధుల్లో చేరిన కొన్ని రోజులకే ట్రైనింగ్ కోసం సాగర్ పోలీస్ శిక్షణ కేంద్రానికి పంపారు. అయితే సదరు కానిస్టేబుల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో రిపోర్ట్ చేయలేదు. ఎవరికీ చెప్పకుండా విదిషలోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. తాను వెళ్తున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అలాగని సెలవు పెడుతున్నట్లు కూడా తెలపలేదు. అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా సర్వీస్ రికార్డును భోపాల్ పోలీస్ లైన్స్‌కు తిరిగి పంపాడు. అయితే పోలీసు శాఖ అతడి శిక్షణ స్థితిగతులను ధృవీకరించకుండానే ఆ ప్రతాలను ఆమోదించింది.
మరోవైపు ఆ కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్‌కు హాజరుకాకపోవడాన్ని అక్కడి అధికారులు కూడా గుర్తించలేదు. భోపాల్ పోలీస్ లైన్స్‌లో కూడా ఎవరూ దీనిపై ప్రశ్నించలేదు. అయినప్పటికీ, అతను సర్వీసులో ఉన్నట్లు అతని పేరు జాబితాలో ఉంది. అతడు డ్యూటీలో ఉన్నట్లుగానే అంతా భావించారు. దీంతో ప్రతి నెలా అతడి బ్యాంకు ఖాతాలో జీతం జమ చేస్తూ వచ్చారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 ఏళ్ల పాటు ఎలాంటి పోలీస్ విధులు నిర్వహించకుండానే సదరు పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా రూ.28 లక్షలకుపైగా జీతం తీసుకున్నాడు.
అయితే 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ పే గ్రేడ్ పెంచేందుకు 2023లో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జరిపిన ఇంటర్నల్ దర్యాప్తులో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీస్ శాఖలో అతడి పేరు, ముఖాన్ని కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. అంతర్గత విచారణ సమయంలో, అధికారులు కానిస్టేబుల్ గత రికార్డులు, సర్వీస్ రిటర్న్‌లను ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 12 ఏళ్లుగా విధులకు హాజరుకాకుండా, ఒక్క కేసు కూడా అప్పగించకుండా, అధికారిక విధుల్లో పాల్గొనకుండా జీతం పొందుతున్న కానిస్టేబుల్ సంగతి తెలిసి అధికారులు షాక్ అయ్యారు. అతడి రికార్డులు, సర్వీస్ వివరాలు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను భోపాల్ పోలీస్ లైన్స్‌కు పిలిపించి ప్రశ్నించగా.. తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపాడు. అందుకే ఇన్నేళ్లుగా విధులకు హజరుకాలేదని చెప్పాడు. దీనికి సంబంధించిన పత్రాలు చూపించాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అంకితా ఖతేర్కర్ తెలిపారు. రూ.1.5 లక్షలు తిరిగి ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇకపై తన సర్వీసుకాలంలో వచ్చే జీతం నుంచి చెల్లిస్తానని తెలిపాడు. ప్రస్తుతం అతడు భోపాల్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఏసీపీ ఖేద్కర్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.