PM Modi: లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనుల వేగవంతంపై ప్రధాని హర్షం.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోనే అగ్రగామి ఓడరేవుగా ఉన్న గుజరాత్‌లోని లోథాల్ తిరిగి పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమైంది. లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ స్థలంలో జరుగుతున్న పనులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ..

కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోనే అగ్రగామి ఓడరేవుగా ఉన్న గుజరాత్‌లోని లోథాల్ తిరిగి పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమైంది. లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ స్థలంలో జరుగుతున్న పనులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 18వ తేదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎర్రకోట వేదికగా తాను మాట్లాడిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ లోథాల్ ఓడరేవు దేశ వారసత్వానికి గర్వకారణమని అన్నారు. మన దేశ చరిత్రలో ఎన్నో వారసత్వ కట్టడాలు, వారసత్వ సంపదలు ఉన్నాయని, అయితే వాటిని సంరక్షించడంలో గత పాలకులు విఫలమయ్యారని తెలిపారు. చరిత్రలోని దేశ వారసత్వ సంపదల గురించి తెలుసుకుంటే వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్నారు. భారతదేశదేశంలో సముద్ర తీర ప్రాంతాల్లోని ఓడరేవులకు ఎంతో చరిత్ర ఉందన్నారు. మీరంతా నేరుగా చారిత్రక ప్రపంచ వారసత్వాలలో ఒకటైన లోథల్‌లో ఉన్నారని, తాను టెక్నాలజీ ద్వారా సుదూర ఢిల్లీ నుండి మీతో కనెక్ట్ అయినప్పటికి తన మనస్సులో మీ అందరి మధ్యలో నేను ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన పనులను డ్రోన్ ద్వారా తాను చూశానని, వాటి పురోగతిని కూడా సమీక్షించానని తెలిపారు. మన పూర్వీకులు అందించిన గొప్ప వారసత్వం మన సముద్ర వారసత్వమని, ఏదైనా ప్రదేశం లేదా సమయం యొక్క చరిత్ర రాబోయే తరానికి కూడా స్ఫూర్తినిస్తుందన్నారు. శతాబ్దాల క్రితం భారతదేశం యొక్క వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు లోథల్ ఓడరేవు వేదికగా నిలిచిందన్నారు.
ప్రపంచంలోని ప్రతి నాగరికతతో భారత్ కు సంబంధాలు ఉన్నాయని, అందుకే కాబట్టి భారతదేశ సముద్ర శక్తి వెనుక పెద్ద పాత్ర ఉందన్నారు. సుదీర్ఘ కాలపు బానిసత్వం భారతదేశం యొక్క సామర్థ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా, కాలక్రమేణా భారతీయులమైన మనం కూడా మన సామర్థ్యం పట్ల ఉదాసీనంగా మారామన్నారు. వేల సంవత్సరాల క్రితమే సముద్ర వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన లోథాల్, ధోలవీర లాంటి గొప్ప వారసత్వం మనకు ఉందని మరిచిపోయామన్నారు. మన దక్షిణాన కూడా సముద్ర వనరుల శక్తిని అర్థం చేసుకుని అపూర్వమైన ఔన్నత్యాన్ని అందించిన చోళ సామ్రాజ్యం, చేర వంశం, పాండ్య రాజవంశం వచ్చాయని, వారు తమ సముద్ర శక్తిని విస్తరించడమే కాకుండా, దాని సహాయంతో సుదూర దేశాలకు వాణిజ్యాన్ని తీసుకెళ్లడంలో కూడా విజయం సాధించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా బలమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసి విదేశీ ఆక్రమణదారులకు సవాలు విసిరారని అన్నారు.
భారతదేశ చరిత్రలో ఇదంతా గర్వించదగిన అధ్యాయమనితెలిపారు. వేల సంవత్సరాల క్రితం కచ్‌లో, పెద్ద ఓడల నిర్మాణ పరిశ్రమ నడిచేదన్నారు. భారతదేశంలో తయారైన పెద్ద ఓడలు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడేవని గుర్తు చేశారు. భారతదేశానికి గర్వకారణమైన లోథాల్ ఓడరేవుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈరోజు లోథాల్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు.. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌లోని అనేక ప్రాంతాలలో సికోటార్ మాతను పూజిస్తారని, ఆమెను సముద్ర దేవతగా పూజిస్తారని తెలిపారు. వేల సంవత్సరాల క్రితం లోథాల్‌పై పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఆ సమయంలో కూడా సికోటార్ మాతను ఏదో ఒక రూపంలో పూజించారని చరిత్ర చెబుతోందన్నారు. సముద్రంలోకి వచ్చే ముందు సికోటార్ దేవిని పూజించి, ఆతర్వాత సముద్రంలో ఓడలపై ప్రయాణించేవారని ప్రధానమంత్రి తెలిపారు.




ఇటీవల వాద్‌నగర్ సమీపంలో త్రవ్వకాలలో సికోటార్ మాత ఆలయం బయటపడిందని, పురాతన కాలంలో ఇక్కడి నుండి సముద్ర వాణిజ్యం గురించిన సమాచారం లభ్యమైన కొన్ని ఆధారాలు కూడా కనుగొనబడ్డాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. అదేవిధంగా సురేంద్రనగర్‌లోని జింఝువాడ గ్రామంలో లైట్‌హౌస్ ఉన్నట్లు ఆధారాలు లభించాయని, రాత్రిపూట ఓడలకు దారి చూపడానికి లైట్ హౌస్‌లు నిర్మించారనే విషయం అందరికి తెలిసిందేనన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..