INDIA కూటమి లోగో రెడీ.. ముహూర్తం, వేదిక ఖరారు.. ఇక విడుదల చేయడమే తరువాయి.. నెక్స్ట్ ఏంటి..?
Logo of INDIA alliance: ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) లోగో సిద్ధమైంది. తదుపరి సమావేశంలోనే విడుదల చేసేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. తదుపరి ముంబై మహానగరంలో జరగబోయే సమావేశంలో 'లోగో' ఆవిష్కరించేందుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Logo of INDIA alliance: ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) లోగో సిద్ధమైంది. తదుపరి సమావేశంలోనే విడుదల చేసేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. తదుపరి ముంబై మహానగరంలో జరగబోయే సమావేశంలో ‘లోగో’ ఆవిష్కరించేందుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో విపక్ష కూటమి సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సమావేశాలు ముగిసాయి. మొదటి సమావేశం జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, బిహార్ ఉప-ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సంయుక్తంగా బిహార్ రాజధాని నగరం పాట్నాలో విపక్ష కూటమి తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ సారథ్యంలో రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. బెంగళూరు సమావేశంలో కూటమి I.N.D.I.A గా నామకరణం జరిగింది. ముంబైలో జరగనున్న మూడో సమావేశానికి శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే) వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఆతిథ్యమిస్తున్నారు.
ప్రతి సమావేశానికి కూటమిలో భాగస్వామ్య పార్టీల సంఖ్యాబలం పెరుగుతూ వస్తోంది. పాట్నా సమావేశంలో సుమారు 17 పార్టీలకు చెందిన 32 మంది హాజరవగా.. బెంగళూరు సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. దేశ ఆర్థిక రాజధానిలో జరిగే కూటమి మూడో సమావేశంలో 26 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 80 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 26 పార్టీలు కూటమిలో భాగంగా ఉండగా.. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగే సమావేశంలో మరికొన్ని పార్టీలు కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపాయి. సమావేశంలో రెండో రోజు సెప్టెంబర్ 1న రోజంతా చర్చలు జరగనున్నాయి. ఆ రోజు ‘లోగో’ ఆవిష్కరణతోనే చర్చలను ప్రారంభించే అవకాశం ఉంది. తొలిరోజు.. అంటే ఆగస్టు 31న ముంబై సబర్బన్‌లో ఉన్న గ్రాండ్ హయత్ హోటల్‌లో కూటమి నేతలకు శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే విందు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కూటమిలోని వివిధ పార్టీల నేతలు ఆగస్టు 31 సాయంత్రం గం. 6.00 లోపే ముంబై మహానగరానికి చేరుకుంటారని కూటమి వర్గాలు తెలిపాయి. మరుసటి రోజు, అదే వేదికపై కూటమి సమావేశం జరగనుంది. తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది.
ఏర్పాట్లలో మహావికాస్ అఘాడి నిమగ్నం..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగంతో పాటు ముంబై యూనిట్ల ద్వారా ప్రతిపక్ష నేతలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నారు. కూటమి మూడో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలతో పనిచేస్తున్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నసీమ్ ఖాన్ తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్, శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సహా మహా వికాస్ అఘాడి (MVA) నాయకులందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పారు. “సందర్శకులు హోటల్‌కు చేరుకున్నప్పుడు సంప్రదాయ స్వాగతం పలుకుతారు. సన్నాహాల్లో భాగంగా నేతలంతా తరచుగా చర్చించుకుంటున్నారు’’ అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో శివసేన (UBT) నేతలు ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేతలు వర్ష గైక్వాడ్, మిలింద్ దేవరా, నసీమ్ ఖాన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకులు నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న సమావేశం తర్వాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెంట్రల్ ముంబైలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం తిలక్ భవన్‌ను సందర్శించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.




రెండో సమావేశం అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక సహా దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్ష పెట్టేలా ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ఓటింగ్, అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరిగాయి. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో I.N.D.I.A కూటమి అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులతో విపక్ష నేతలను బెదిరిస్తూ, ఒత్తిళ్లకు గురిచేస్తున్నారంటూ ఇప్పటికే కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆ చర్యలన్నీ తమ ఐక్యతను దెబ్బతీయలేవని, ఇంకా చెప్పాలంటే మరింత బలోపేతం చేస్తాయని నేతలంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముంబై సమావేశంలో కూటమి ‘లోగో’ ఆవిష్కరణతో పాటు ఏం సందేశం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




