Kerala: ప్రేమించమంటూ యువతి వెంటపడ్డాడు.. నిరాకరించిందని.. ఇంటికెళ్లి మరి దారుణంగా..
కేరళలోని కన్నూర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందని.. ఓ దుర్మార్గుడు యువతిని దారుణంగా చంపాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు.

కేరళలోని కన్నూర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందని.. ఓ దుర్మార్గుడు యువతిని దారుణంగా చంపాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు. ఈ ఘటన కన్నూర్‌లోని పానూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నూర్‌కు చెందిన విష్ణుప్రియ (23) అనే యువతి ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో పని చేస్తోంది. ఈ సమయంలో కూతుపరంబాకి ప్రాంతానికి చెందిన శ్యామ్‌జిత్ అనే యువకుడు తనను ప్రేమించమంటూ వెంటపడ్డాడు. అయితే.. విష్ణుప్రియ అతని ప్రేమను నిరాకరించింది. దీంతో ఆ యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదేక్రమంలో.. సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన విష్ణుప్రియను గమనించాడు. అనంతరం ఆ యువతి దుస్తులు మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది.
ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు.. ఇంట్లోకి చొరబడి విష్ణుప్రియ గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. కుటుంబసభ్యులు ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటి చుట్టూ టోపీ, బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.




ఆమె మెడతో పాటు చేతులపైన కత్తితో పొడిచిన గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కన్నూర్ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..