Kerala gold smuggling case: బంగారం.. బిర్యానీ.. కన్నీరు.. మధ్య భగ్గుమన్న కేరళ రాజకీయం
గోల్డ్ స్కామ్‌లో కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలు చేశారు.
Kerala gold smuggling case: కోట్లలో విలువ చేసే బంగారు కడ్డీలను గుట్టు చప్పుడు కాకుండా అరబ్ నుంచి కేరళకు అక్రమ రవాణా చేశారు అప్పట్లో. కానీ తిరువనంతపురం ఏయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తే పార్శిళ్లలో గోల్డ్ స్మగ్టింగ్ గుట్టు రట్టయింది. స్వప్నా సురేష్, ఐఏఎస్ శివశంకర్ పేర్లు తెరపైకి వచ్చాయి. అరెస్టులు జరిగాయి. శివశంకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బెయిల్‌పై వున్నస్వప్నా సురేష్..తాజాగా మెజిస్ట్రేట్ దృష్టికి కీలక అంశాలను తీసుకెళ్లారు. గోల్డ్ స్కామ్‌లో కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలు చేశారు.
అంతేకాదు బిర్యానీ పాత్రల పాత్ర కూడా బయటపడింది. బిర్యానీ అంతగా రుచించని కేరళ సీఎం విజయన్ ఇంటికి బిర్యానీ పాత్రలు వెళ్లడం వెనుక మర్మమేంటో కుండబద్దలు కొట్టారు స్వప్నా సురేష్. దుబాయ్ రాయబార కార్యాలయం నుంచి బ్యాగ్‌ల్లో బంగారం స్మగ్లింగ్ చేశారని , సీఎం మాజీ సెక్రటరీ శివశంకర్ ఆ బ్యాగ్‌లను తీసుకున్నారని స్వప్నా సురేశ్ ఆరోపించారు. అంతేకాకుండా UAE కాన్సులేట్ నుంచి సీఎం నివాసానికి పంపించిన బిర్యానీ పాత్రల్లో కూడా బంగారం స్మగ్లింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు స్వప్నా సురేశ్.
స్వప్నా సురేష్ వ్యాఖ్యలతో కేరళ వ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమన్నాయి. గోల్డ్ స్కామ్‌లో సీఎం విజయన్ హస్తం వుందని ఎప్పటి నుంచో గీ పెడుతోన్న విపక్షాలు, స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలను అస్త్రంగా మలుచుకున్నాయి. సీఎం విజయన్ రాజీనామా చేయాలంటూ ఓవైపు కాంగ్రెస్,మరో వైపు బీజేపీ పోటాపోటీగా డిమాండ్ చేశాయి. బిర్యానీ పాత్రలు..డమ్మీ బంగారు బిస్కెట్లతో సింబాలిక్ గా ఆందోళనలు ఉధృతం చేశారు ఆ రెండు పార్టీల శ్రేణులు. ఐతే బిర్యానీ ఆందోళనలను చాలా లైట్‌గా కొట్టిపారేశారు అధికార పక్ష నేతలు.కొందరు స్వప్నా సురేష్‌ను పావుగా వాడుకొని రాజకీయ డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు మంత్రి మహ్మద్ రియాస్.
స్వప్పా చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. నిరాధార ఆరోపణలపై చర్యలు తప్పవని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇక మచ్చలేని ముఖ్యమంత్రి అవినీతి మరలేస్తారా అంటూ అధికారపక్షం కన్నెర్ర చేసింది. సీఎం విజయన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేశారంటూ మాజీ మంత్రి కేటీ జలీల్ ఇచ్చిన ఫిర్యాదుపై స్వప్పపై కేసు నమోదయ్యింది.
మరోవైపు విచారణలో వున్న గోల్డ్ స్కాంపై మాట్లాడి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో స్వప్నా సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది కేరళ హైకోర్టు. అయితే సీఎం విజయన్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తూ చేస్తూ విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..