కన్నడ నాట 2019 లో ఏం జరిగింది..?

కన్నడనాట ఈ ఏడాది రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కుమారస్వామి సీఎం పదవిని వదులుకోవలసివచ్చింది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప మళ్లీ కన్నడ పీఠాన్ని అధిరోహించారు. ఇక నటి, దివంగత కాంగ్రెస్‌ నేత అంబరీష్‌ సతీమణి సుమలత మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కుమారస్వామి తనయుణ్ణే ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇక మరికొన్ని విషాద ఘటనలు కూడా జరిగాయి. కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ, మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర పీఏ. రమేష్‌ […]

కన్నడ నాట 2019 లో ఏం జరిగింది..?
Follow us
Anil kumar poka

| Edited By:

Updated on: Dec 26, 2019 | 10:41 PM

కన్నడనాట ఈ ఏడాది రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కుమారస్వామి సీఎం పదవిని వదులుకోవలసివచ్చింది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప మళ్లీ కన్నడ పీఠాన్ని అధిరోహించారు. ఇక నటి, దివంగత కాంగ్రెస్‌ నేత అంబరీష్‌ సతీమణి సుమలత మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కుమారస్వామి తనయుణ్ణే ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇక మరికొన్ని విషాద ఘటనలు కూడా జరిగాయి. కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ, మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర పీఏ. రమేష్‌ ఆత్మహత్యలు కలకలం రేపాయి. 2019లో జరిగిన విశేషాలను ఒకసారి చూద్దాం..

కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. కర్ణాటక రాజకీయాలు ఈ ఏడాది కీలక మలుపులు తిరిగాయి. మాజీ సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న వేళ..కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కార్‌కు షాకిచ్చారు. తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్లు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాను కలిశారు. దీంతో కాంగ్రెస్‌ బలం 76కు పడిపోగా..కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ బలం 117కు తగ్గిపోయింది. బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. ఆ తర్వాత మరో 17మంది రెబల్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వడంతో కుమారస్వామి రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితేర్పడింది. ఇక ఆ తర్వాత కర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి.

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు ఐతే 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో కన్నడ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. సీఎం యడ్యూరప్ప మరోసారి బలం నిరూపించుకోవలసిన పరిస్థితేర్పడింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో స్వతంత్ర అభ్యర్థితో మద్దతుతో బీజేపీకి 106 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌ 66, జేడీఎస్‌ 34..ఆ కూటమికి మొత్తం 100మంది సభ్యులున్నారు. మరో 17మందిపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. 106 మంది సభ్యులున్న బీజేపీ..మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకోవాలంటే మరో ఏడుగురు శాసనసభ్యులు అవసరం.  ఈ నేపథ్యంలో  ఈ నెల 5న 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు..కమలం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఐతే బై పోల్‌లో కమలం వికసించి తిరిగి అధికారం కైవసం చేసుకుంది. మొత్తం 15స్థానాలకుగానూ 12చోట్ల బీజేపీ జెండా ఎగిరింది. 12 నియోజకవర్గాలను తానా ఖాతాలో వేసుకొని కన్నడనాట తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇక కాంగ్రెస్‌ 2, ఇతరులు ఒక స్థానం గెలుకుకున్నారు.

సిద్ధరామయ్య కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లోనే గెలవడంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. అంతేకాదు. శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా రాజీనామా చేసినట్లు చెప్పారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఆయన..కన్నడ పీఠాన్ని అధిరోహించారు. వృత్తిరీత్యా లాయర్‌ అయిన ఆయన 1978వరకూ న్యాయవాదిగానే సేవలందించారు. ఆ తర్వాత జేడీఎస్‌లో చేరి రెండు సార్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2005-06లో దేవెగౌడతో విభేదాలు రావడంతో జేడీఎస్‌ నుంచి బయటికొచ్చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలకవ్యక్తిగా ఎదిగారు. 2018లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డ్‌ సృష్టించారు. ఇక 2019 ఉప ఎన్నికల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవికి రాజీనామా చేశారు.

కుమారస్వామి 2018లో కర్ణాటకలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మొదట యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినా..విశ్వాస పరీక్షలో ఓడిపోయి కుర్చీ దిగిపోయారు.  తర్వాత  కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కుమారస్వామి. ఐతే మళ్లీ 2019 జులైలో జరిగిన పరిణామాలతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 17 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అధికారాన్ని కోల్పోయింది.  కుమారస్వామి మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైనా మొదట్లో రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఐతే ఆ తర్వాత 1996లో రాజకీయ ప్రవేశం చేసి కనకపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1998లో అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి డిపాజిట్‌ కూడా కోల్పోయారు. 1999లో సాథనూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2004లో రామనగర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఐతే ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడటంతో ధరమ్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐతే 42 మంది ఉన్న జేడీఎస్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీతో కలిసి 2006 ఫిబ్రవరి నుంచి 2007 అక్టోబర్‌ వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయడంతో.. 2007 నవంబర్‌లో యడ్యూరప్ప సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జేడీఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి 2014లో మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక 2018లో సీఎం పీఠమెక్కి మళ్లీ కొద్ది కాలానికే పదవి కోల్పోయారు.

సుమలత లోక్‌సభ ఎంపీ సుమలత ఈ ఏడాదే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె..మాండ్య నుంచి గెలిచి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు.  ఆమె భర్త, నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంబరీష్‌ కన్నుమూయడంతో..హస్తం పార్టీ అభ్యర్థిగా మాండ్య నుంచి పోటీకి సిద్ధమయ్యారు సుమలత. ఐతే పొత్తులో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో ఆమెకు టికెట్‌ లభించలేదు.  జేడీఎస్‌ తరపున మాండ్య నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ బరిలో నిలవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు సుమలత. హోరాహోరీ పోరులో నిఖిల్‌పై 580 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచి మాండ్య సెంటిమెంట్‌ రిపీట్‌ చేశారు. అంతేకాకుండా మాండ్య స్థానం నుంచి 52 ఏళ్ల తర్వాత లోక్‌సభకు వెళ్లిన తొలి మహిళా స్వతంత్ర ఎంపీగా రికార్డ్‌ సృష్టించారు. ఇక నిఖిల్‌ కూడా ఈ ఎన్నికలతోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.

ఐటీ దాడులు..మాజీ సీఎం పీఏ ఆత్మహత్య ఇక అక్టోబర్‌లో కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర పీఏ రమేష్‌ ఆత్మహత్య కలకలం సృష్టించింది. కాంగ్రెస్‌ నేతలు పరమేశ్వర, మాజీ ఎంపీ ఆర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పరమేశ్వర ఇంటితో పాటు విద్యాసంస్థల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రమేష్‌ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. ఆ తర్వాత రమేష్‌ బెంగళూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

విజయ్‌ మాల్యా భారత బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి..విదేశాలకు ఉడాయించిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాను ఈ ఏడాది భారత్‌కు అప్పగిస్తారని వార్తలొచ్చాయి. కానీ లండన్‌ హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.  తనను భారత్‌కు అప్పగింతకు వ్యతిరేకంగా ఆయన చేసిన అప్పీలును ఏప్రిల్‌లో తిరస్కరించిన యూకే కోర్టు..మోఖిక అప్పీలుకు అవకాశమిచ్చింది. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావీద్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పేర్కొన్న 5 అభ్యంతరాల్లో ఒక దానిపై విచారణకు కోర్టు అంగీకరించింది. దీంతో ఈ కేసుపై యూకే హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. 2006 నుంచి లండన్‌లోనే తలదాచుకుంటున్న మాల్యా..కొడుకు సిద్దార్థ్‌ మాల్యాతో కలిసి అక్కడ జల్సా చేస్తున్నాడు.

కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఆత్మహత్య ఈ ఏడాది జూలైలో సంచలనంగా మారింది. బిజినెస్‌లో తీవ్ర నష్టాలతో మనస్థాపం చెందిన సిద్ధార్థ..సూసైడ్‌ నోట్‌ రాసి నేత్రావది నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్స్‌ తనను వేధిస్తూన్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.  సిద్దార్థ కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు. కాఫీ తోటల యజమాని కొడుకైన వీజీ సిద్దార్థ..అంచెలంచెలుగా ఎదిగారు. కాఫీ డే గ్లోబల్‌ కంపెనీని 6 కోట్ల వార్షిక టర్నోవర్‌ నుంచి 2,500కోట్ల టర్నోవర్‌కు ఎదిగేలా చేశాడు. దేశీయంగా, అంతర్జాతీయంగా 250 నగరాల్లో 1750కి పైగా కాఫీ షాపులున్నాయి.  వాటితో పాటు కాఫీ తోటల కొనుగోలు, టెక్నాలజీ, ఫైనాన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫర్నీచర్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లోకి ప్రవేశించారు. 50వేల మందికి పైగా ఉద్యోగాల కల్పించిన సిద్దార్థ జీవితం చివరకు విషాదాంతంగా ముగిసింది.  కొన్నేళ్లుగా అప్పుల భారంతో నష్టాలు పెరిగిపోవడంతో ఒత్తిడిని భరించలేక సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు సిద్దార్థ.

హనీ ట్రాప్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యేలు కన్నడ నాట పలువురు ఎమ్మెల్యేలు, మాజీలు హనీ ట్రాప్‌ ముఠా బారిన పడిన ఘటన నవంబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కిలాడీ లేడీస్‌ మొదట ఎమ్మెల్యేల వద్దకు తమ కష్టం చెప్పుకునేందుకు వెళ్లి వారితో పరిచయం పెంచుకొని తర్వాత తమ హొయలతో హోటల్‌ రూమ్స్‌కు రప్పించుకునేవారు. అక్కడ వారితో క్లోజ్‌గా ఉన్న వీడియోలను రహస్యంగా రికార్డ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే ఉత్తర కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే వీరి హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఆయనతో ఈ మహిళలు సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరించటంతో…ఆయన పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పీఠాధిపతిగా రెండేళ్ల చిన్నారి కర్ణాటక గుల్బర్గాలోని శరణ బసవేశ్వర మహాసంస్థాన 9వ పీఠాధిపతిగా రెండేళ్ల బాలుడు దొడ్డప్పఅప్ప ఎంపికయ్యారు.  8వ పీఠాధిపతి డా. శరణ బసవప్ప అప్ప, దాక్షాయణి అవ్వలతో పాటు పలు వీరశైవ మఠాల ప్రముఖుల ఆధ్వర్యంలో ఆ చిన్నారి పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 36ఏళ్ల క్రితం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డా.శరణబసప్ప తన వారసుడిగా రెండేళ్ల బాలుడికి ఈ బాధ్యతలు అప్పగించారు. పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తన కుమారుడికి స్వయంగా డా.శరణబసప్ప ఆధ్యాత్మిక పాఠాలను బోధించారు. రెండేళ్ళ బాలుడు మహాసంస్థాన పీఠాధిపతిగా పట్టాభిషిక్తుడు కావడం మహాసంస్థాన చరిత్రలో ఇదే తొలిసారి. 18వ శతాబ్ధపు గురువు బసవేశ్వర శ్రీకారం చుట్టిన మార్గంలోనే ఇకపై ఈ చిన్నారి పీఠాధిపతిగా విధులు కొనసాగించనున్నారు.