Dog bite: ప్రసూతి వార్డులో దారుణం.. అప్పుడే పుట్టిన శిశువును నోట కరచుకెళ్లిన వీధి కుక్క
గత కొంత కాలం క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సంగతి ఇంకా మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోని ఓ నవజాత శిశువును కుక్క నోటకరచుకుని ఈడ్చుకెళ్లింది. ఈ దారుణ ఘటన..
గత కొంత కాలం క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సంగతి ఇంకా మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోని ఓ నవజాత శిశువును కుక్క నోటకరచుకుని ఈడ్చుకెళ్లింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో శనివారం (ఏప్రిల్ 1) చోటుచేసుకుంది.
శివమొగ్గ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి ఓ వీధి కుక్క శనివారం నాడు ఉదయం 7 గంటల ప్రాంతంలో నవజాత శిశువును నోటకరచుకొని బయటికి ఈడ్చుకెళ్లింది. వీధికుక్క నవజాత శిశువును నోటకరచుకొని ప్రసూతి వార్డు చుట్టూ తిరగడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు దాన్ని తరిమికొట్టారు. కుక్క నోటి నుంచి వదిలిన శిశువును వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఐతే వీధి కుక్క కాటు వల్లనే నవజాత శిశువు మరణించిందా లేదా అంతకుముందే మరణించిందా అనే అనే విషయంపై వైద్యులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన శిశువు తల్లిదండ్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నవజాత శిశువు సమాచారం కోసం ప్రసూతి వార్డులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కుక్కల బెడదపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవల్సిందిగా అధికారుల నిర్లిప్తతపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.