Karnataka CM BS Yediyurappa Resigns: కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా..
అనుకున్నదే జరిగింది. ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. రెండు సంవత్సరాలుగా కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్ప.. అనేక నాటకీయ పరిణామాల..
అనుకున్నదే జరిగింది. ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. రెండు సంవత్సరాలుగా కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్ప.. అనేక నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు. కర్నాటకంలో ఇది క్లైమాక్స్ సీన్. ఎట్టకేలకు రాజీనామా ప్రకటన చేశారు యడ్యూరప్ప. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆయన గవర్నర్‌కు కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యడియూరప్ప మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ప్రతిక్షణం అగ్నిపరీక్షే అంటూ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానంటూ వెల్లడించారు. అయినా రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లుగా చెప్పుకొచ్చారు.
తనకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయీ కేంద్రంలో మంత్రిపదవి ఇస్తానని చెప్పారు. కానీ తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉంటానని యడ్యూరప్ప కన్నీళ్లుపెట్టుకున్నారు.
It has been an honour to have served the state for the past two years. I have decided to resign as the Chief Minister of Karnataka. I am humbled and sincerely thank the people of the state for giving me the opportunity to serve them. (1/2)
— B.S. Yediyurappa (@BSYBJP) July 26, 2021
ఇదిలావుంటే.. గత వారం క్రితం ఢిల్లీ వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలోనే ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా హింట్ ఇచ్చారు. ఆ వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోడీతోపాటు అమిత్ షాను కలిశారు.
అడ్డంకిగా వయసు..
ఇక ఆయనకు వయసు అడ్డంకిగా మారింది. బీజేపీలో 75 ఏళ్లు పైబడిన నాయకులను పదవులు ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. ఇప్పుడు యడ్యూరప్ప ఏజ్ 77 ఏళ్లు. దీంతో.. ఆయన్ను రాజీనామా చేయాలంటూ అధిష్టానం చెప్తూ వచ్చింది. సంప్రదింపులు కూడా జరిగాయి. పార్టీ అధినాయకత్వం చెప్పినట్టు వింటానంటూనే కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది యడ్యూరప్ప.
సడెన్‌గా తెరపైకి వచ్చింది కాదు..
యడ్యూరప్ప రాజీనామా వ్యవహారం సడెన్‌గా తెరపైకి వచ్చింది కాదు. కొన్నాళ్లుగా నలుగుతున్నదే. ప్రభుత్వంలో, పరిపాలనలో యడ్డీ కుమారుల జోక్యం పెరిగిందనే ఆరోపణలు పెరిగిపోయాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత యడ్యూరప్పతో రాజీనామా చేయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టే.. యడ్డీకి సన్నిహితురాలు శోభ కరంద్లాజేకు కేబినెట్ పదవి ఇచ్చారు. దీంతో.. యడ్యూరప్పను సాగనంపడం ఖాయమని తెలిసిపోయింది.
బీజేపీ అధికారంలోకి రావడానికి యడ్యూరప్పే కీలకం..
కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి యడ్యూరప్పే కీలకం. వన్ మ్యాన్ షో నడిపారాయన. దీంతో.. ఆయన్ను సడెన్‌గా తీసేయాలని అధినాయకత్వం అనుకోలేదు. గౌరవప్రదంగా తప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగానే ఢిల్లీ పిలిపించి అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది.
కండిషన్స్ అప్లై..
తన కుమారుడికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నది అందులో ప్రథమంగా కనిపిస్తోంది. ఒకానొక దశలో తన కుమారుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కూడా యడ్యూరప్ప భావించారు. కానీ.. వారసత్వ రాజకీయాలను ఇష్టపడని బీజేపీలో.. అది గొంతెమ్మ కోర్కెగా తేలిపోయింది. అటు బీజేపీ నాయకత్వం కూడా అందర్నీ ఒప్పించి.. యడ్యూరప్పను తప్పుకునేలా చేసింది.