Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election Exit Poll Results 2023 Highlights: కర్ణాటకలో ఓటర్ల తీర్పు అదే.. ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్‌

Sanjay Kasula

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 10, 2023 | 8:44 PM

Karnataka Assembly Opinion Poll 2023 Highlights in Telugu: కర్నాటక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.. ఇక ఫలితమే రావాల్సి ఉంది. కర్నాటక ఎన్నికల్లో 224 నియోజక వర్గాలలో 2 వేల 6 వందల 13 మంది హోరాహోరీగా తలపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు పోటీ పడ్డాయి. మరి ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఈనెల 13న తేలనుంది. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. కాంగ్రెస్‌ సత్తా చాటి పగ్గాలు చేపడుతుందా అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Karnataka Election Exit Poll Results 2023 Highlights: కర్ణాటకలో ఓటర్ల తీర్పు అదే.. ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్‌
Karnataka Elections

కర్నాటక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.. ఇక ఫలితమే రావాల్సి ఉంది. కర్నాటక ఎన్నికల్లో 224 నియోజక వర్గాలలో 2 వేల 6 వందల 13 మంది హోరాహోరీగా తలపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు పోటీ పడ్డాయి. మరి ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఈనెల 13న తేలనుంది. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. కాంగ్రెస్‌ సత్తా చాటి పగ్గాలు చేపడుతుందా అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీలో టాప్‌ టు బాటమ్‌ లీడర్స్‌ అంతా కూడా ఫోకస్ పెట్టి మరీ ప్రచారం చేశారు. అమిత్‌షా చాణక్యం, చివరి నిమిషంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌షోలతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. మోదీ ఇమేజ్‌ తమ విజయానికి దోహదపడుతుందంటున్నారు బీజేపీ నాయకులు. అటు 130కు పైగా సీట్లతో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ అంటోంది. మరోసారి కింగ్‌ మేకర్‌ కాదు.. ఏకంగా కింగ్‌ అవుతామని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయి. ప్రీపోల్‌ సర్వేల కంటే కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ దాదాపు నిజమవుతాయని పార్టీలు నమ్ముతుంటాయి. మరి కర్నాటక ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్ కీలకం కాబోతున్నాయి..

కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కన్నడ ఓటర్లు సిద్ధమవుతున్నారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం BJP, కాంగ్రెస్‌,JDS మధ్యే నెలకొంది. మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈసారి పోటీ చేస్తున్న వారిలో మహిళల సంఖ్య చాలా తక్కువుంది. మొత్తం 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. కర్నాటకవ్యాప్తంగా 58 వేల 545 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 918 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు.

పోలింగ్‌ సందర్భంగా ప్రధాని మోదీ కర్నాటక ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. ఈసారి బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కర్నాటక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్నోవేషన్‌లో కర్నాటకను అగ్రస్థానంలో నిలపాలన్నది తమ ఆకాంక్ష అని కన్నడ ఓటర్లకు ప్రధాని తెలిపారు. విద్యా, ఉద్యోగాలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలోనూ నెంబర్‌ వన్‌ స్థానంలో కర్నాటకను నిలుపుతామని అన్నారు.

లైవ్ కోసం ఇక్కడ చూడండి

కర్నాటకలో మొత్తం ఓటర్లు 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది ఓటర్లు ఉన్నారు. తొలిసారి ఓటర్లు 11 లక్షల 71 వేల 558 మంది ఉన్నారు. మరో వైపు ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులను కూడా ఎన్నికల సంఘం మొహరించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1000 మంది పోలీసులు, 1000 మంది హోంగార్డులు , తెలంగాణ నుంచి 516 మంది పోలీసులు, 684 మంది హెంగార్డులు కర్నాటక ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 May 2023 08:31 PM (IST)

    70 శాతం వరకు పోలింగ్‌ నమోదయ్యే సూచనలు

    వారం మధ్యలో పోలింగ్‌ నిర్వహిస్తే ఓటింగ్‌ శాతం పెరగవచ్చన్న ఎన్నికల సంఘం అంచనాలు కర్నాటకలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కర్నాటక అసెంబ్లీ పోలింగ్‌ ప్రాథమిక అంచనాల ప్రకారం 70 శాతం వరకు పోలింగ్‌ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 66 శాతం పోలింగ్‌ నమోదైంది. ఐదేళ్ల క్రితం జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 72 శాతం పోలింగ్‌ రికార్డైంది.

  • 10 May 2023 07:32 PM (IST)

    జీ మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే..

    జీ మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే.. బీజేపీ 79-94, కాంగ్రెస్ 103-118, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5 దక్కించుకుంటాయని అంచనా వేసింది..

  • 10 May 2023 07:27 PM (IST)

    ఆత్మసాక్షి..

    ఆత్మసాక్షి..

    బీజేపీ: 83 – 94

    కాంగ్రెస్: 117 – 124

    జేడీఎస్: 23 – 30

    ఇతరులు: 2 – 8

  • 10 May 2023 07:26 PM (IST)

    పొలిటికల్ ల్యాబరేటరీ..

    పొలిటికల్ ల్యాబరేటరీ..

    బీజేపీ: 80

    కాంగ్రెస్: 108

    జేడీఎస్: 32

    ఇతరులు: 04

  • 10 May 2023 06:59 PM (IST)

    జన్ కీ బాత్ సర్వే..

    జన్ కీ బాత్ సర్వే.. బీజేపీ 94-117, కాంగ్రెస్ 91-106, జేడీఎస్ 14-24, ఇతరులు 0-4 దక్కించుకుంటాయని అంచనా వేసింది..

  • 10 May 2023 06:57 PM (IST)

    రిపబ్లిక్ టీవీ సర్వే..

    రిపబ్లిక్ టీవీ సర్వే.. బీజేపీ 85-100, కాంగ్రెస్ 94-108, జేడీఎస్ 24-31, ఇతరులు 2-6 దక్కించుకుంటాయని అంచనా వేసింది..

  • 10 May 2023 06:51 PM (IST)

    పీపుల్స్ పల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్..

    పీపుల్స్ పల్స్ సర్వే.. బీజేపీ 78-90, కాంగ్రెస్ 107-119, జేడీఎస్ 23-29, ఇతరులు 0-3 దక్కించుకుంటాయని అంచనా వేసింది..

  • 10 May 2023 06:45 PM (IST)

    టీవీ9 కన్నడ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్..

    టీవీ9 కన్నడ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్.. కర్ణాటకలో బీజేపీ 83-95, కాంగ్రెస్ 100-112, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4 దక్కించుకుంటాయని అంచనా వేసింది..

  • 10 May 2023 06:40 PM (IST)

    కర్ణాటకలో ఆ పార్టిదే అధికారం.. టీవీ9 భారత్‌వర్ష్..

    కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ను విడుదల చేశాయి. 224 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4 స్థానాలు దక్కించుకుంటాయని టీవీ9 భారత్‌వర్ష్ అంచనా వేసింది.

  • 10 May 2023 06:33 PM (IST)

    కర్నాటక ఎన్నికల్లో ముగిసిన కీలక ఘట్టం..

    కర్నాటక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.. ఇక ఫలితమే రావాల్సి ఉంది. కర్నాటక ఎన్నికల్లో 224 నియోజక వర్గాలలో 2 వేల 6 వందల 13 మంది హోరాహోరీగా తలపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు పోటీ పడ్డాయి. మరి ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఈనెల 13న తేలనుంది.

  • 10 May 2023 06:06 PM (IST)

    కర్ణాటకలో ముగిసిన పోలింగ్..

    కర్ణాటకలో సాయంత్రం ఆరు గంటలతో పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 65.69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిలబడిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల పోలింగ్ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

  • 10 May 2023 05:38 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

  • 10 May 2023 05:34 PM (IST)

    భారీ మెజార్టీతో గెలుస్తాం.. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం షెట్టర్‌

    భారీ మెజార్టీతో గెలుస్తామని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత జగదీశ్‌ షెట్టర్‌ పేర్కొన్నారు. హుబ్లి-ధార్వాడ్‌ సెంట్రల్‌ సీటు నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న షెట్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 May 2023 04:20 PM (IST)

    కర్నాటక పోలింగ్‌లో ఉద్రిక్తత..

    కర్నాటక పోలింగ్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. విజయపుర జిల్లా బస్వన్‌బాగేవాడీ నియోజకవర్గంలో ఓ గ్రామస్థులు VVPATలతోపాటు EVMలను పగులకొట్టారు. పోలింగ్‌ సిబ్బందితోపాటు పోలీసులపైనా స్థానికులు దాడిచేశారు. ఎన్నికల సిబ్బంది కారు కూడా ధ్వంసం చేశారు. దీంతో మసబినల్‌ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్‌ మధ్యలో వీవీప్యాట్‌లు, ఈవీఎంలు మారుస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

  • 10 May 2023 03:45 PM (IST)

    మధ్యాహ్నం మూడు గంటల వరకు 52.03 శాతం పోలింగ్

    కర్ణాటకలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి వేగం పుంజుకుంది.. మధ్యాహ్నం మూడు గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదైంది.

  • 10 May 2023 02:41 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రులు..

    కర్ణాటక ఎన్నికలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హుబ్లీలోని వివేకానందనగర్‌ రోటరీ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    మరో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ బెంగళూరులోని బీటీఎం లే అవుట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 May 2023 02:23 PM (IST)

    ద్వేషాన్ని పారదోలండి.. ఎమ్మెల్సీ కవిత..

    ద్వేషాన్ని పారదోలండి. అభివృద్ధికి ఓటేయండి అంటూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు.

  • 10 May 2023 02:19 PM (IST)

    సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలి.. కిచ్చా సుదీప్

    “సమస్యలు వ్యక్తిగతమైనవి.. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా ఓటు వేయాలి. నేను ఒక సెలబ్రిటీగా ఇక్కడకు రాలేదు, నేను భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను.. ఇది నా బాధ్యత” అని కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. బెంగళూరులో సుదీప్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 May 2023 02:15 PM (IST)

    ఒంటిగంట వరకు 37.25 శాతం పోలింగ్‌

    కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సుమారుగా 37.25% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

  • 10 May 2023 02:05 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ

    హసన్ జిల్లాలోని పడువలహిప్పే గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్ 251లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ దంపతులు చన్నమ్మ ఓటు వేశారు.

  • 10 May 2023 01:20 PM (IST)

    పోలింగ్‌ బూత్‌లకు నటులు, అగ్రనేతలు క్యూ..

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు సందడి చేశారు. ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. పోలింగ్‌ బూత్‌లకు నటీనటులు క్యూ కట్టారు.

  • 10 May 2023 01:18 PM (IST)

    ఆటో నడుపుతూ పోలింగ్‌ సరళిని పరిశీలించిన సీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ ఆసక్తికరమైన దృశ్యాలు కన్పిస్తున్నాయి. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తాను పోటీ చేస్తున్న కనకపుర నియోజకవర్గంలో ఆటో నడుపుతూ పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఓటింగ్‌ సరళి చూస్తే కాంగ్రెస్‌కు అధికారం ఖాయమన్పిస్తోందన్నారు

  • 10 May 2023 01:06 PM (IST)

    కర్నాటకలో ఫస్ట్ టైమ్ ఓటర్లకు క్రేజ్..

    కర్నాటకలో 224 స్థానాలకు జరుగుతున్న ఓటింగ్ నేపథ్యంలో యువతలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తొలిసారిగా ఓటు వేసిన యువత పోలింగ్ బూత్ వద్దకు రావడంతో సెల్ఫీల యుగం కూడా నడుస్తోంది. కర్ణాటకలో యువ ఓటర్ల సంఖ్య 11,71,558 మంది ఉన్నారు.

  • 10 May 2023 01:04 PM (IST)

    ఓటు వేసిన 106 ఏళ్ల వృద్ధురాలు..

    చన్నగిరి తాలూకా అసెంబ్లీ నియోజకవర్గంలో 106 ఏళ్ల వృద్ధురాలు జాంకీబాయి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. ఆమె ఫోటోను కర్ణాటక ఎన్నికల సంఘం షేర్ చేసింది.

  • 10 May 2023 12:54 PM (IST)

    ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తి మృతి

    ఓటు వేసి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని బేలూరు తాలూకా చిక్కోల్ గ్రామంలో చోటుచేసుకుంది. చిక్కోలు గ్రామానికి చెందిన జయన్న(49) దురదృష్టవశాత్తు మృతి చెందాడు. చిక్కోల్ గ్రామంలో ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం ఆవరణలోనే గుండెపోటుతో మృతి చెందాడు.

  • 10 May 2023 12:52 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న వధూవరులు..

    కర్ణాటకలో ఓటింగ్ కొనసాగుతుండగా ఉదయం నుంచి ప్రజలు క్యూలైన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఓటింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలు బయటకు వస్తున్నాయి. మైసూరులోని ఓ పోలింగ్ బూత్‌లో వధూవరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 May 2023 12:13 PM (IST)

    జై బజరంగ్ బాలి..

    బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓటు వేసిన తర్వాత తన ఫోటోను పోస్ట్ చేశారు. ఇందులో సిరా గుర్తు చూపుతూ కనిపించారు. ఈ చిత్రంతోపాటు “ఓటు వేయండి, జై బజరంగ్ బలి”… కామెంట్‌ను జోడించారు.

  • 10 May 2023 12:08 PM (IST)

    కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో.. -మల్లికార్జున్ ఖర్గే

    కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకుంటున్నారని.. అవినీతిని పారద్రోలి అభివృద్ధిని తీసుకొచ్చే ప్రభుత్వం కావాలి.. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో 130-135 సీట్లు గెలుచుకుంటుంది.

  • 10 May 2023 11:57 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు మొత్తం 20.94 శాతం పోలింగ్‌

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. అన్ని రంగాల్లోని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరితోపాటు పెద్ద ఎత్తున యువకులు తరలి వస్తుండటంతో  పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఉదయం 11 గంటల వరకు మొత్తం 20.94 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 10 May 2023 11:35 AM (IST)

    క్యూలో నిలుచుని ఓటు వేసిన మైసూరు మహారాజు, మహారాణి..

    మైసూరు నగరంలోని కేఆర్ మొహల్లాలోని శ్రీకాంత పాఠశాలలో యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్, త్రిషికా కుమారి ఓటు వేశారు.

  • 10 May 2023 11:17 AM (IST)

    పదవీ విరమణ చేయను కానీ ఎన్నికల్లో పోటీ చేయను..

    ఓటు వేసిన అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. తనకు 60% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నేను పదవీ విరమణ చేయను కానీ ఎన్నికల్లో పోటీ చేయను. ఇదే నా చివరి ఎన్నికలు.

  • 10 May 2023 11:10 AM (IST)

    ఫలితాల అనంతరం జేడీఎస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్..

    ఎన్నికల అనంతరం జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ప్రశ్నించగా.. ఎలాంటి అవకాశం లేదని, మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • 10 May 2023 10:19 AM (IST)

    ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్ ఓటు వేశారు. ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.

  • 10 May 2023 10:02 AM (IST)

    కర్ణాటకలో గత 5 ఎన్నికల ఓటింగ్ శాతం

    కర్నాటకలో గత ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా ఉంది..

    •  1999 – 67.65%
    • 2004 – 65.17%
    • 2008 – 64.68%
    • 2013 – 71.45%
    • 2018 – 72.10%
  • 10 May 2023 10:00 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం..

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం అందించిన సమాచారం ప్రకారం.. ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్ నమోదైంది.

  • 10 May 2023 09:56 AM (IST)

    హుషారుగా పోలింగ్

    కర్ణాటక ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 8.11 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

  • 10 May 2023 09:46 AM (IST)

    పోలింగ్ లైవ్ అప్ డేట్స్ దిగువ వీడియోలో చూడండి

  • 10 May 2023 09:45 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మలా సీతారామన్‌

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరులో ఓటేశారు. జయనగర్‌లోని పోలింగ్‌బూత్‌కు వెళ్లిన ఆమె ఓటర్లతో కలిసి క్యూలో నిల్చున్నారు. కాసేపు అక్కడున్న వారితో సరదాగా ముచ్చటించారు.

  • 10 May 2023 09:18 AM (IST)

    ఓటు వేసిన నూతన వధువు

    కర్నాటకలో అసెంబ్లీ పోలింగ్‌ జోష్‌ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున యువకులు క్యూ లైన్ లో నిలుచుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చిక్కమగళూరులో ఓ వధువు కూడా ఓటు వేసేందుకు పెళ్లి బట్టలతో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 May 2023 09:14 AM (IST)

    క్యూ లైన్‌లో నిలబడి ఓటు వేసిన సీఎం బసవరాజ్ బొమ్మై

    షిగావ్‌లోని పోలింగ్ బూత్‌కు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ..తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో నిలబడి వారి టైమ్‌ వచ్చే వరకూ వేచి ఉండి ఓటు వేశారు. అంతకుముందు బొమ్మై హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.

  • 10 May 2023 09:09 AM (IST)

    కర్ణాటక ప్రజలకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి

    కర్ణాటక ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలోని నా సోదరీమణులందరికీ ఓటు వేయండి.. మార్పు కోసం ఓటు వేయాలని కోరుతున్నాను అని ఆమె అన్నారు.

  • 10 May 2023 09:07 AM (IST)

    ఓటు వేయడం నా కర్తవ్యం.. – సుధా మూర్తి

    ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి జయనగర్‌లో ఓటు వేశారు. దీని తర్వాత ఆమె మాట్లాడుతూ, “ఓటు వేయడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను, ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగం, ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఓటర్లు లేకుంటే అది ప్రజాస్వామ్యం కాదు, కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను.

  • 10 May 2023 09:06 AM (IST)

    ఓటు వేయని వారికి విమర్శించే హక్కు లేదు – నారాయణ మూర్తి

    బెంగళూరులో ఓటు వేసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందు ఓటు వేయండి.. ఆ తర్వాతే ప్రశ్నించండి. ఓటు వేయని వారికి విమర్శించే హక్కు లేదన్నారు.

  • 10 May 2023 09:05 AM (IST)

    బెంగళూరులో ఓటు వేసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి

    ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన ఓటు వేయడానికి బెంగళూరులోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. కుటుంబంతో కలిసి ఎక్కడ ఓటు వేశారు.

  • 10 May 2023 09:01 AM (IST)

    పోటీలో ఉన్న 10 మంది మాజీ సీఎంల కుమారులు

    కర్ణాటకలో 10 మంది మాజీ సీఎంల కుమారులు పోటీలో ఉన్నారు. ఇందులో బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మాజీ సీఎం ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బసవరాజ్‌ బొమ్మై సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. 

  • 10 May 2023 08:05 AM (IST)

    ఎన్నికల సంఘం తొలి ప్రయత్నం.. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ

    బెంగళూరులోని పోలింగ్ బూత్‌లో మొదటిసారిగా భారత ఎన్నికల సంఘం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఫేషియల్ రికగ్నేషన్‌ కోసం మొబైల్ అప్లికేషన్‌లో ఓటర్లు తమ ఎలక్టర్స్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి OTPని జనరేట్ చేయాలి. జనరేట్ అయిన తర్వాత ఓటర్లు యాప్ ద్వారా సెల్ఫీని అప్‌లోడ్ చేయాలి. ఓటరు పోలింగ్ బూత్‌కు చేరుకున్నప్పుడు, వెరిఫికేషన్ కోసం వారి ఫేస్‌ని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి స్కాన్ చేస్తారు. ఓటరు EPICలోని ఫొటో, EC డేటాబేస్‌లోని ఫొటోతో మ్యాచ్ అయితే.. ఓటరు ఎలాంటి ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్‌ అందించకుండానే ఓటు వినియోగించుకోవచ్చు. ఓటింగ్‌లో ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ క్యూలను తగ్గించడం.. తక్కువ సిబ్బందిని నియమించుకోవడం లాంటి ప్రయోజనాలను అందిస్తుంది.

  • 10 May 2023 07:59 AM (IST)

    కర్నాటక ఎన్నికల్లో నెంబర్ గేమ్

    • ఒక్కో సీటుకు సగటున 12 మంది అభ్యర్థులు
    • బెల్గాంలోని 18 స్థానాల్లో గరిష్టంగా 187 మంది అభ్యర్థులు ఉన్నారు
    • కొడగులోని 2 స్థానాల్లో కనీసం 24 మంది అభ్యర్థులు
    • అభ్యర్థుల సగటు ఆస్తులు 12 కోట్లు
    • 7 శాతం మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు
  • 10 May 2023 07:58 AM (IST)

    కర్ణాటక ఎన్నికల్లో సంపన్న అభ్యర్థులు వీరే..

    ఈసారి కర్ణాటక ఎన్నికల్లో చాలా మంది సంపన్న అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఇందులో అత్యంత ధనిక స్వతంత్ర అభ్యర్థి యూసుఫ్ షరీఫ్, అతని ఆస్తులు 1,633 కోట్లు. సంపన్న అభ్యర్థుల జాబితాలో బీజేపీకి చెందిన ఎన్ నాగరాజు (1,609 కోట్లు), కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ (1,413 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  • 10 May 2023 07:54 AM (IST)

    కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప

    తాలూకా 134వ పోలింగ్‌ స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఇంతలో ఎంపీ బీవై రాఘవేంద్ర, బీవై విజయేంద్ర ఓటు వేశారు.

  • 10 May 2023 07:48 AM (IST)

    జయనగర్‌లో ఓటు వేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

    జయనగర్‌లోని బీఈఎస్‌ పోలింగ్‌ కేంద్రంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఓటు వేశారు.

  • 10 May 2023 07:46 AM (IST)

    ఓటు వేసిన 96 ఏళ్ల బామ్మ

    మైసూరులోని చాముండిపురం పోలింగ్ కేంద్రంలో 96 ఏళ్ల బామ్మ ఓటు వేసింది. గుండూరావు నగరానికి చెందిన బంగారమ్మ పోలింగ్ స్టేషన్ నంబర్ 233లో ఓటు వేశారు.

  • 10 May 2023 07:42 AM (IST)

    ఓటు వేస్తే పట్టు మొక్క ఫ్రీ..

    శిడ్లఘాట్ నగరంలోని సెరికల్చర్ ఎగ్జిబిషన్ బూత్ అందరినీ ఆకర్షిస్తోంది. ఓటర్లు ఉచితంగా పట్టు మొక్కలు పొందవచ్చు. సెరికల్చర్ దశలతో సహా సెరికల్చర్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. పట్టు గూళ్ల నుంచి వివిధ అలంకరణ వస్తువుల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.

  • 10 May 2023 07:38 AM (IST)

    ఓటు వేసిన ప్రకాష్ రాజ్

    శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు వేశారు.

  • 10 May 2023 07:30 AM (IST)

    ఓటు వేయాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు

    పోలింగ్ రోజున, కర్ణాటకలోని మా సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను. మీ ఒక్క ఓటు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రజానుకూలమైన, ప్రగతిశీల ప్రభుత్వాన్ని నిర్ధారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

  • 10 May 2023 07:28 AM (IST)

    ఓటు వేసిన సిద్దగంగ శ్రీ..

    కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రారంభం కాగా, తుమకూరులోని సిద్దగంగా మఠానికి చెందిన సిద్దలింగ శ్రీ సిద్దగంగా మఠంలోని సీనియర్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు.

  • 10 May 2023 07:27 AM (IST)

    అందరూ ఓటు వేయండి.. ప్రధాని మోదీ ట్వీట్..

    కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు ట్వీట్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

  • 10 May 2023 07:15 AM (IST)

    కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు..

    కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం BJP, కాంగ్రెస్‌,JDS మధ్యే నెలకొంది. మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Published On - May 10,2023 7:15 AM

Follow us