Encounter: దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం.. నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోమారు ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం అర్ధరాత్రి వేళ దక్షిణ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలు మధ్య ఎదురు కాల్పులు జరగగా.. నలుగురు మావోలు మృతి చెందారు. ఈ ఘటనలో దంతెవాడ DRG హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలం నుంచి భారీగా అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
ఛత్తీస్ ఘడ్, జనవరి 5: ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతం మరోమారు నెత్తురోడింది. నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అధికారులు ప్రకటన జారీ చేశారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో దంతెవాడ DRG హెడ్ కానిస్టేబుల్ కరమ్ సన్ను మృతి చెందారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఎస్ ఎల్ ఆర్, లేటెస్ట్ ఆటోమేటిక్ వంటి ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కాగా 2024లో ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 200కుపైగా మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 2026 నాటికి మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. గతేడాది హతమైన 219 మంది మావోయిస్టుల్లో 217 మంది బస్తర్, దంతెవాడ, కంకేర్, బీజాపూర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతానికి చెందినవారు. 800 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. 2024లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన పోరులో 18 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల హింసలో మరణించిన పౌరుల సంఖ్య 65గా నమోదైంది.