ISRO: ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి..బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో చరిత్రలో మరో రైలు రాయిని నమోదు చేసుకుంది. ఆదివారం శ్రీహరికోట వేదికగా చేపట్టిన LVM3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో చరిత్రలో మరో రైలు రాయిని నమోదు చేసుకుంది. ఆదివారం శ్రీహరికోట వేదికగా చేపట్టిన LVM3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్ వెహికల్ మార్క్ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాగా.. ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఒక్కొటి 150 కిలోగ్రాముల బరువు ఉండే ఉపగ్రహాలను ఇస్రోకి చెందిన బాహుబలి రాకెట్ లో 12 విమానాల్లో నిక్షిప్తం చేశారు. అంతరిక్షంలోని వెళ్లిన తర్వాత ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ విమానాలు విడిపోయి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాయి. భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఉపగ్రహాలు పనిచేయనున్నాయి. ఈ ప్రయోగం కోసం ఉపయోగించే లాంచ్ వెహికల్ పేరును GSLV జియోసింక్రనస్ లాంచ్ వెహికిల్ మార్క్ త్రీని లాంచ్ వెహికల్ మార్క్ త్రీగా మార్చారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేసి.. సక్సెస్ అయ్యారు.
అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఇండియా ఎదుగుతోంది. బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ సంస్థతో ఇస్రో 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది అక్టోబర్ 23న 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో తాజాగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది..
భూమికి తక్కువ ఎత్తులోని కక్ష్యలోకి పంపే ఈ ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ అందించాలన్నది లక్ష్యం. వన్‌వెబ్ సంస్థకు భారత్‌కు చెందిన భారతి గ్లోబల్, ఫ్రాన్స్‌కు చెందిన యూటెల్‌శాట్, బ్రిటన్ ప్రభుత్వానికి, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకుకు దీనిలో వాటాలున్నాయి. ఉపగ్రహ ప్రయోగాల కోసం రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌తో వన్‌వెబ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కాని, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ ఒప్పందాన్ని బ్రిటన్ రద్దు చేసుకుంది. గతేడాది మార్చిలోనే ఒప్పందం రద్దైంది.
ఈ LVM త్రీ అనేది మూడు దశల లాంచ్ వెహికల్‌గా పనిచేస్తుంది. భూమి దిగువ కక్ష్య అంటే Ku బ్యాండ్‌లో ఈ ఉపగ్రహాలు ఉంటాయి. ఈ 36 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వన్‌వెబ్ సంస్థ చేపట్టిన 648 ఉపగ్రహాల ప్రయోగం పూర్తవుతుంది. వన్‌వెబ్ సంస్థ నిర్వహిస్తున్న 18వ లాంచ్ ఇది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఈ మధ్యే ఈ సంస్థ 17వ లాంచ్ పూర్తి చేసింది. వీటి ద్వారా భూగ్రహం మొత్తం ఉపగ్రహాలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..