India gold Mines: భారతదేశ నేలలో దాగి ఉన్న ‘బంగారు నిధి’, ఏపీతో సహా దేశంలోని 5 పెద్ద బంగారు గనులు ఎక్కడ ఉన్నాయంటే..
భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. పసిడి స్టేటస్ సింబల్ మాత్రమే కాదు ఆర్ధిక భరోసా ఇస్తుందని నమ్మకం. అయితే గత కొంత కాలంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చి చుక్కలను తాకుతున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం. ఈ నేపధ్యంలో మన దేశంలో బంగారు నిక్షేపాలున్న ప్రదేశాలు ఏమిటి? ఎంత మొత్తం బంగారం నిల్వలు ఉన్నాయో తెలుసుకుందాం..

కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా తహసీల్‌లోని మహాగవాన్ కియోలారి గ్రామానికి సమీపంలోని బేలా గ్రామ పంచాయతీలో పెద్ద మొత్తంలో బంగారు నిక్షేపం ఉన్నట్లు నిర్ధారించబడింది. చాలా సంవత్సరాల కృషి , సర్వే తర్వాత, భూగర్భ శాస్త్రవేత్తలు ఇక్కడ భూమి కింద అతి పెద్ద మొత్తంలో బంగారం వంటి విలువైన లోహాలు ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఖనిజ సంపద సమృద్ధిగా ఉందని.. అయితే ఇప్పుడు బంగారు గనుల ఆవిష్కరణ రాష్ట్ర ఆర్థిక స్థితిలో పెద్ద మార్పును తీసుకురాగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నిల్వ సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని, మిలియన్ల టన్నుల బంగారం ఇందులో ఉండవచ్చని ప్రాథమిక సర్వేలు వెల్లడించాయి. ఈ ఆవిష్కరణ స్థానిక ప్రజలకు ఉపాధి, పురోగతికి కొత్త మార్గాలను తెరవడమే కాదు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
దీనితో పాటు భారతదేశంలో భూమిలో బంగరు నిక్షేపాలున్న అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. దేశంలోని 5 అతిపెద్ద బంగారు గనుల గురించి.. ఇప్పటివరకు అత్యధిక మొత్తంలో బంగారం ఎక్కడి నుంచి తవ్వబడింది అనే విషయం కూడా తెలుసుకుందాం..
భారతదేశంలో ఎంత బంగారు నిల్వలు ఉన్నాయి? భారతీయ సంస్కృతి, సంప్రదాయం, పెట్టుబడిలో బంగారం ఒక ముఖ్యమైన భాగం. వివాహాల నుంచి పండుగల వరకు.. ఏ సందర్భంలోనైనా బంగారం ఎల్లప్పుడూ ప్రజలకు ఇష్టమైనదే. 2025 మార్చి 31 వరకు ఉన్న డేటా ప్రకారం భారతదేశంలో మొత్తం అంచనా వేసిన బంగారు నిల్వలు దాదాపు 879.58 మెట్రిక్ టన్నులు. బంగారం పరంగా భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటి అని ఇది స్పష్టం చేస్తుంది.
దేశంలోని ప్రధాన బంగారు గనులు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో అనేక బంగారు గనులు ఉన్నాయి. అవి చారిత్రాత్మకంగానే కాదు నేటికీ దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని ఐదు పెద్ద, ప్రసిద్ధ బంగారు గనుల గురించి తెలుసుకుందాం.
హుట్టి బంగారు గనులు, కర్ణాటక- ఇది భారతదేశంలోని పురాతన, అతిపెద్ద బంగారు గనిగా పరిగణించబడుతుంది. దీని చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల నాటిది. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి దాదాపు 1.8 టన్నుల బంగారం వెలికితీయబడుతుంది. ఈ గని ఇప్పటికీ పూర్తిగా చురుకుగా ఉంది. మన దేశంలో బంగారం ప్రధాన వనరుగా ప్రసిద్దిగాంచింది.
కోలార్ బంగారు క్షేత్రాలు (KGF), కర్ణాటక- 1880లో బ్రిటిష్ పాలనలో ఇక్కడ బంగారు తవ్వకం ప్రారంభమైంది. 2001 నాటికి ఇక్కడ నుంచి దాదాపు 800 టన్నుల బంగారం వెలికితీయబడింది. ప్రస్తుతం ఇది మూసివేయబడింది. అయితే దీనిని తిరిగి ప్రారంభించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయం తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సోనభద్ర, ఉత్తరప్రదేశ్: 2020 సంవత్సరంలో ఇక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ భారీ మొత్తంలో బంగారం దాగి ఉండవచ్చని నమ్ముతారు. ఈ శోధన విజయవంతమైతే ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌కు బంగారు కేంద్రంగా మారవచ్చు.
రామగిరి బంగారు క్షేత్రం, ఆంధ్రప్రదేశ్- ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా బంగారం ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బంగారం ఉండే మంచి అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో మైనింగ్ పనులకు ముఖ్యమైన ప్రాంతంగా నిలిచే అవకాశం ఉంది.
చిగర్ గుంట, బిసనత్తమ్ , ఆంధ్రప్రదేశ్- చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాంతంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. పర్యావరణం అనుమతి లభిస్తే రానున్న కాలంలో ఇక్కడి నుంచి బంగారం ఉత్పత్తి చేయనున్నారు. ఇది ఏపీకి లబ్ది చేకూర్చడంతో పాటు దేశం మొత్తం బంగారం సరఫరాకు లోటు ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








