INDIAN BILLIONAIRES: దేశంలో వేగంగా పెరుగుతున్న బిలియనీర్లు.. అయిదేళ్ళలో మూడు రెట్లు పెరిగారు.. సంపదంతా వారి దగ్గరేనా?

మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలుచుకుంటూ ఉన్నాము. నా దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది అని అనుకొని యువత ఉండదు.

INDIAN BILLIONAIRES: దేశంలో వేగంగా పెరుగుతున్న బిలియనీర్లు.. అయిదేళ్ళలో మూడు రెట్లు పెరిగారు.. సంపదంతా వారి దగ్గరేనా?
Billionaires
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 16, 2021 | 7:35 PM

INDIAN BILLIONAIRES HOLDING ENORMOUS ASSETS: మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలుచుకుంటూ ఉన్నాము. నా దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది అని అనుకొని యువత ఉండదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందిందా లేక ఇంకా చెందుతూనే ఉందా అన్న అంశాన్ని పక్కన పెడితే ఈ దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు అంటే 7 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారి సంఖ్య మాత్రం ప్రతి యేటా గణనీయంగా పెరుగుతోంది. సంపద కలిగిన వారు మరింత సంపన్నులుగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన ఉమ్మడి సంపద గత ఐదు సంవత్సరాలలో ఏకంగా 60 శాతం పెరిగింది. ఈ మేరకు హురున్ ఇండియా సంస్థ తన నివేదికను తాజాగా విడుదల చేసింది. 2020 డిసెంబర్ ఆఖరు నాటికి ఈ 15 రంగాలకు చెందిన బిలియనీర్ల సంపద 37.3 9 లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది.

2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ 23.26 లక్షల కోట్లుగా ఉంది. నాలుగు సంవత్సరాలలో గణనీయంగా పెరిగి 37.39 లక్షల కోట్లకు వారి ఉమ్మడి సంపద విలువ ఎగబాకింది. 2016లో టాప్ 15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి వీరి సంఖ్య 613 పెరిగింది. అంటే అయిదేళ్ళలో దేశంలో బిలియనీర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నమాట. ముఖ్యంగా ఫార్మా రంగ ప్రముఖులు అత్యధిక సంపదతో ఈ జాబితాలో నిలిచారు. 2020లో దేశవ్యాప్త లాక్డౌన్ అమలు చేసిన  కరోనా పాండమిక్ పీరియడ్‌లోను ఫార్మా రంగం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని చేసింది. అదే సమయంలో ఫార్మా రంగం విపరీతమైన ఆదాయాన్ని సంపాదించినట్లు కూడా ఈ నివేదిక ప్రస్తావించింది.

మన దేశంలో సంపద పరుల జాబితాలో ఫార్మా రంగం 2016 నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2016 నాటికి 39 మంది  ఫార్మా రంగ ప్రముఖులు బిలియనీర్లుగా వుండగా 2020 నాటికి వీరి సంఖ్య 121కి పెరిగింది. అలాగే 2016 నాటికి వారి ఉమ్మడి సంపద విలువ 5 లక్షల 20 వేల 800 కోట్ల రూపాయలు ఉండగా.. అది ఇప్పుడు 8 లక్షల 12 వేల 800 కోట్లకు ఎగబాకింది. కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ రంగానికి చెందిన  55 మంది బిలియనీర్ల ఆస్తుల విలువ 3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన బిలియనీర్లు 2016లో రెండోస్థానంలో ఉన్నా.. ఐదేళ్లు తిరిగేసరికి వారి సంఖ్య 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యాపరంగా కాస్త మెరుగ్గానే వున్నారు ఎఫ్ఎంసీజీ రంగ బిలియనీర్లు. వారి ఆస్తుల విలువ 2.45 లక్షల కోట్ల నుంచి 3.5 లక్షల కోట్లకు పెరిగింది.

టెక్నాలజీ రంగం కూడా అత్యధిక మిలియనీర్లతో ఉమ్మడి సంపద విలువ భారీగా పెంచుకుంటోంది. 2016లో టెక్నాలజీ రంగానికి చెందిన 21 మంది బిలియనీర్లు 2 లక్షల 42 వేల 19 వందల కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత కూడా టెక్నాలజీ రంగం అదే స్థానాన్ని అంటే మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశంలోని వివిధ నగరాలను పరిశీలిస్తే ముంబై అత్యధిక బిలియనీర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో ఉన్న బిలియనీర్లలో 217 మంది ముంబై మహానగరంలోనే వున్నారు. ఇదే నగరంలో 2016 నాటికి 104 మంది బిలియనీర్లు వుండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 217కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో 129 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో బెంగళూరు 67 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది.  ఆ తర్వాత నాలుగో స్థానం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానిదే. హైదరాబాద్ నగరంలో 50 మంది బిలియనీర్లున్నారు.  38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ అయిదో స్థానంలో నిలిచింది. చెన్నైలో 37 మంది, కోల్‌కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు.