AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర.. మెరుపు ఆపరేషన్‌తో దొరికిపోయిన 253 మంది టెర్రరిస్టులు!

స్వాతంత్ర్య దినోత్సవం ముందు దేశవ్యాప్తంగా భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిగింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్ (SBN)కు చెందిన 253 మంది టెర్రరిస్టులను 14 రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. ఐఈడీ దాడులు, లక్షిత హత్యలకు పన్నాగం పన్నిన ఈ నెట్‌వర్క్ కుట్రను భద్రతా సంస్థలు సమన్వయంతో ఛేదించాయి. ఉగ్రవాదంపై కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర..  మెరుపు ఆపరేషన్‌తో దొరికిపోయిన 253 మంది టెర్రరిస్టులు!
Sbn Terror Network Busted
Balaraju Goud
|

Updated on: Aug 17, 2026 | 7:16 PM

Share

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్‌ (SBN)ను పోలీసులు ఛేదించారు. పలు రాష్ట్రాల్లో సమన్వయంతో టెర్రర్ ఆపరేషన్ చేపట్టినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆగస్టు 12న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 14 రాష్ట్రాలకు చెందిన 253 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఎస్‌బీఎన్‌పై ఇప్పటివరకు 80కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. 200 మందికి పైగా అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ గ్రెనేడ్ దాడులు, ఐఈడీ పేలుళ్లు, పెట్రోల్ బాంబు దాడులు, లక్షిత హత్యలకు స్థానిక ఏజెంట్లను ఉపయోగించేందుకు ప్రయత్నించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

స్థానిక యువతను ఆన్‌లైన్‌ ద్వారా ఆకర్షించడం, డబ్బు ఆశ చూపించడం, కీలక ప్రాంతాలపై నిఘా నిర్వహించడం వంటి కార్యకలాపాలకు ఈ నెట్‌వర్క్ ప్రయత్నించినట్లు భద్రతా సంస్థలు వెల్లడించాయి. పోలీస్ స్టేషన్లు, రక్షణ సంస్థలు, మతపరమైన ప్రదేశాలపై రెక్కీ నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఆపరేషన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో 62 మంది, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్‌లో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లో 15, మహారాష్ట్రలో 8, ఉత్తరాఖండ్‌లో 5 మంది పట్టుబడ్డారు. కర్ణాటక, గుజరాత్, బీహార్‌లలో ముగ్గురు చొప్పున, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, కేరళలో ఇద్దరు చొప్పున అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.

దర్యాప్తులో భాగంగా ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్‌ క్యాట్రిడ్జ్‌లు, గూఢచర్యానికి ఉపయోగించిన సీసీటీవీ పరికరాలు సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. నెట్‌వర్క్‌కు పాకిస్థాన్‌ ఆధారిత హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. గత కొన్ని నెలల్లో ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ సహా పలు ప్రాంతాల్లో భట్టి నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై వరుసగా చర్యలు జరిగుతున్నాయి.

ఇప్పటికే షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లో అరెస్టులు, దాడులు, సోదాలు జరిగాయి. ఎన్‌ఐఏ కూడా ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసుల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీమాంతర ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కొనసాగిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు కలిగించే కుట్రలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ సమన్వయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us